మహిళల భద్రతకు పటిష్ట చర్యలు

* మిర్యాలగూడ పట్టణంలో షీ టీమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
* టూ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శన, వాహనాల క్లియరెన్స్ కు అన్ని నిబంధనలు పాటించాలని సూచన
* ప్రజల మన్ననలు పొందేలా పోలీసింగ్ ఉండాలని సూచన

డీఐజీ రంగనాధ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు డీఐజీ, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాధ్ తెలిపారు. అదనపు ఎస్పీ నర్మద, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర రావులతో కలిసి మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన వివరాలను టూ టౌన్ ఇన్స్ పెక్టర్ నిగిడాల సురేష్ ను అడిగి తెలుసుకున్నారు. 5-ఎస్ ఫైల్స్ నిర్వహణ విధానం పర్యవేక్షించి సిబ్బందితో మాట్లాడి వారిని అభినందించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వారి రక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మరింత సమర్ధవంతంగా పని చేస్తున్నదని చెప్పారు. మహిళలు ఫిర్యాదు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్యూ ఆర్‌ కోడ్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. బాలికలు బహిరంగ ప్రదేశాల్లో, పనిచేసే చోట వేధింపులకు, భౌతిక దాడులకు గురికావడం, ఈవ్‌ టీజింగ్‌, బెదిరింపులకు గురి చేస్తే వెంటనే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. షి టీమ్ పోలీస్ స్టేషన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో దీర్ఘకాలంగా ఉన్న వాహనాలకు సంబంధించి యజమానులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని, కోర్టు ద్వారా వాహనాల క్లియరెన్స్ కోసం అవసరమైన అన్ని రకాల నిబంధనలు విధిగా పాటిస్తూ సీజ్ చేయబడిన వాహనాలు, దీర్ఘకాలంగా పోలీస్ స్టేషన్లలో వదిలేయబడిన వాహనాల విషయంలోనూ వాటి యజమానులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సర్ధార్ నాయక్, షి టీమ్ అధికారి మాధురి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *