యునెస్కో గుర్తింపుపై ఉత్కంఠ

ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ*

*ఆశగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలు*

*ములుగు/వెంకటాపూర్,అక్షిత బ్యూరో* :- రామప్పకు యునెస్కో వారసత్వ హోదా ఎప్పుడు దక్కుతుందోనని వేచిచూస్తున్న జనాలకు గుర్తింపు సమావేశాలు శుక్రవారం మొదలు కావడంతో ఉత్కంఠ నెలకొంది.రామప్ప అన్ని దశలను దాటుకొంటూ చివరికి వచ్చింది.ఈ నెల 16 నుండి 31 వరకు యునెస్కో హెరిటేజ్ కమిటీ ఆన్లైన్ లో వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం కానుంది.ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 255 చారిత్రక కట్టడాలు,ప్రదేశాలు పోటీ పడుతున్నాయి.మన దేశం నుంచి గుజరాత్ లోని డోలవీర ఆలయంతో పాటు రామప్ప దేవాలయం పోటీలో ఉన్నాయి.ఇప్పటి వరకు భారతదేశంలో 38 కట్టడాలకు ప్రపంచ వారసత్వ హోదా దక్కగా,తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క కట్టడం కూడా ఇప్పటివరకు ఆ హోదా పొందలేదు.ఈ క్రమంలో రామప్ప దేవాలయానికి హోదా దక్కుతుందని తెలుగు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.మూడు రకాల ప్రత్యే కతలతో రామప్ప గుడి ప్రజెంటేషన్‌ను మన ప్రభుత్వం వివరించనున్నది.ఆలయ గోపుర నిర్మాణానికి వాడిన అతి తేలికైన నీటిలో తేలే ఇటుకలు,సాండ్ బాక్స్ టెక్నా లజీ (ఇసుకపై నిర్మాణం),800 సంవత్సరాలుగా రంగు కోల్పోకుండా ఉన్న మూడు రకాలు రాళ్లు వంటివి రామప్ప దేవాలయం ప్రత్యేకతలు.గర్భగుడిలో సహజమైన వెలుతురు,రాళ్లలో సరిగమలు,సన్నని వెంట్రుక దూరే సూక్ష్మరంద్రాలు,పురాణ గాథలు,నాటి జీవనశైలి,ఆధునికత ఉట్టిపడే మదనికలు, నంది విగ్రహం, ఉపాలయాలు, రామప్ప చెరువు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తప్పక వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.చైనాలో యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రీ అజొలే అధ్యక్షతన హెరిటేజ్ ప్రతినిధుల బృందం ప్రపంచంలో ఉన్న 255 చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు వాటి ప్రాముఖ్యత ఆధారంగా ఓటింగ్ చేయనున్నారు. నెలాఖరులోగా ఓటింగ్ పూర్తవుతుంది. అనంతరం ఓటింగ్లో మెజార్టీ సాధించిన వాటికి యునెస్కో గుర్తింపు హోదా దక్కనుంది.ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం గుర్తింపులో భాగంగా నిర్వహించే ప్రక్రియ విజయవంతం అవుతుందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నమ్ముతున్నాయి.ఇందు కోసం విశేషంగా కృషి చేస్తున్నాయి. ఆస్ట్రేలియా,స్పెయిన్, తదితర దేశాలతో మన ప్రతినిధులు సంప్రదింపులు జరిపి,మద్దతు కోరుతున్నారు.ఎదేఏమైనాఈ నెల 21 నుంచి 25 వరకు రామప్ప అంశం చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో
రామప్ప భవితవ్యం ఈ నెల 25 వా తేదీ వరకు తెలిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *