సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోనే మ్యుటేషన్లు

 రిజిస్ట్రేషన్‌, పురపాలకశాఖల సాఫ్ట్‌వేర్ల అనుసంధానం

★ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు ప్రారంభం

★ ఖాళీ స్థలాలకు వీఎల్‌టీఎన్‌తో వెంటనే మ్యుటేషన్‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : రాష్ట్రంలో ఇకపై సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే ఆస్తుల మ్యుటేషన్‌ పూర్తికానున్నది. ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించిన మ్యుటేషన్‌ వెంటనే అవుతుండగా, ఈ నెలాఖరు నుంచి ఖాళీ స్థలాలకు కూడా మ్యుటేషన్‌ అందుబాటులోకి రానున్నది. స్టాంపులు-రిజిస్ట్రేషన్‌, పురపాలకశాఖ సాఫ్ట్‌వేర్‌లను అనుసంధానం చేస్తున్నామని రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే పలు కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా మ్యుటేషన్‌ను అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మ్యుటేషన్‌ కోసం పురపాలక, నగరపాలక, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది. నిర్మాణాలకు ప్రాపర్టీ టాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (పీటీఐన్‌)తో మ్యుటేషన్‌ చేసినట్టే, ఖాళీ స్థలాలకు వెకేట్‌ ల్యాండ్‌ టాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (వీఎల్‌టీఎన్‌)తో మ్యుటేషన్‌ చేస్తే డబుల్‌ మ్యుటేషన్లకు అవకాశం ఉండదు.

బహుళ ప్రయోజనాలు
——————————–
రిజిస్ట్రేషన్‌ సమయంలో బదిలీ ఫీజుతోపాటు మ్యుటేషన్‌ ఫీజును డీడీ రూపంలో చెల్లిస్తారు. అందుకు సంబంధించిన పత్రాలను మాత్రం మున్సిపల్‌, పురపాలక, నగరపాలక సంస్థలకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో కొన్ని చోట్ల రెండుమూడు నెలలు తిరిగినా మ్యుటేషన్‌ పూర్తికావటంలేదు. దీనికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం వీఎల్‌టీఎన్‌ లేని ప్రాంతాల్లోని ఖాళీ నివాస స్థలాలకు ఆ సంఖ్యలు కేటాయిస్తున్నది. మరోవారం రోజుల్లో వీఎల్‌టీఎన్‌ కేటాయింపు, రెండు శాఖల సాఫ్ట్‌వేర్‌ల అనుసంధానం పూర్తిచేసి, ఈ నెలాఖరు నుంచి సత్వర మ్యుటేషన్‌ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. దీంతో డబుల్‌ రిజిస్ట్రేషన్లు, ఒకరి ఆస్తిని మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసే సమస్యలకు చెక్‌ పెట్టడంతో పాటు వీఎల్‌టీఎన్‌ ఆధారంగా ప్రభుత్వం ఆస్తి పన్ను వసూలు చేసే అవకాశం ఉన్నది. రిజిస్ట్రేషన్‌కు వీఎల్‌టీఎన్‌ అనేది తప్పనిసరి అవుతుంది. దీంతో రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు పూర్తిస్థాయిలో పన్ను చెల్లించి పురపాలకశాఖ క్లియరేన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పన్నుల వసూలు మరింత సులభం అవుతుందని అధికారులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *