విశిష్ట సేవలతోనే పురస్కారాలు

*ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత అవసరం*

*- ఫలితం ఆశించకుండా పని చేయాలి*
*- ఆర్డిఓ రమేష్*

*- ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పురస్కారాల ప్రధానం*

*తొర్రూరు,అక్షిత ప్రతినిధి :

ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత అవసరమని ఆర్డీఓ ఎల్. రమేష్ అన్నారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ని పలు రంగాల ప్రముఖులకు ‘ధర్మశ్రీ సేవా రత్న’ పేరిట నెలకొల్పిన రాష్ట్రస్థాయి పురస్కారాలను అందజేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ధరావత్ విమల ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణకు చెందిన 101 మంది ప్రముఖులకు రాష్ట్రస్థాయి పురస్కారాలు అందించారు. సామాజిక సేవ, విద్య, వైద్యం, కళలు, క్రీడలు తదితర రంగాల్లో కృషీవలురకు పురస్కారాలు దక్కాయి. జ్ఞాపిక, దుశ్శాలువ, ప్రశంసా పత్రం పురస్కార గ్రహీతలు అందుకున్నారు.
అనంతరం ట్రస్ట్ అధ్యక్షులు ధరావత్ విశ్వనాథ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, అద్వైత గ్లోబల్ హెల్త్ కేర్ చైర్మన్ వాకిటి సురేష్ రెడ్డి లతో కలిసి ఆర్డీవో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారానే తగు గుర్తింపు లభిస్తుందని, ఫలితం ఆశించకుండా ఎంచుకున్న రంగంలో కృషి చేస్తే విజయం సాధించవచ్చన్నారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ పేరిట ధరావతు విమల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులను గౌరవించడం అందరి బాధ్యత అని, తండ్రి పేరిట ట్రస్టును నెలకొల్పి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేందుకు విమల తపన పడటం గర్వకారణమన్నారు.అన్ని పనులు ప్రభుత్వమే చేస్తుందనే భావన సరికాదని, ప్రభుత్వ లక్ష్యం సఫలీకృతం కావాలంటే స్థానికుల సహకారం ఎంతో అవసరం అన్నారు. ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన
అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రకృతి పరిరక్షణ, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.నూతన నైపుణ్యాలతో యువత తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్ భారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. నైపుణ్యం కలిగిన యువతరమే నవ్యభారతాన్ని సమగ్రంగా నిర్మించగలరని అభిలషించారు. కరోనా సంక్షోభంలో కొత్త కొత్త నైపుణ్యాలు బయటకు వచ్చాయని అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలైనా రైతన్నలు వ్యవసాయ ఉత్పత్తిని రెట్టింపు చేశారన్నారు. రైతులకు ఉపయోగపడేలా ఇన్నోవేషన్స్‌( ఆవిష్కరణలు) తీసుకురావాలని కోరారు. గత కొద్ది కాలంగా ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విమలను తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్ టీవీ అశోక్ కుమార్, నెల్లూరుకు చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ సువర్ణ కుమారి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బిజ్జాల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ధరావత్ రాజేష్ నాయక్ లంబాడ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ జాదవ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సీతారాములు, కౌన్సిలర్ ధరావత్ సునీత జై సింగ్, కె.వి.రెడ్డి, బానోతు కృష్ణ, చిరంజీవి, డాక్టర్ మౌనిక, బానోతు విజయ, కమల, శ్రీను, శారద, వినోద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *