ఆంక్షల నడుమ… బడులు

నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురుకులాలు మినహా మిగతా పాఠశాలల్లో నేటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అడ్వొకేట్‌ జనరల్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు చర్చించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సవరణలు చేస్తూ రేపటి నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గురుకుల విద్యాలయాలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కేజీ నుంచి పీజీ వరకు, అంగన్‌ వాడీ మొదలు అన్ని పాఠశాలల్లో గతంలో నిర్ణయించిన మాదిరిగానే రేపటి నుంచే ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నిర్ణయించారు. గురుకులాల్లో మాత్రం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు. విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు కచ్చితంగా హాజరు కావాలని బలవంతపెట్టొద్దని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలా? లేక ఆన్‌లైన్‌లో కొనసాగించాలా? అనే స్వేచ్ఛ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాఠశాలకు విద్యార్థులను పంపించాలి, కానీ అక్కడ ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదని కొన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఒప్పంద పత్రాలు తీసుకుంటున్న నేపథ్యంలో దానిపై కూడా విద్యాశాఖ అధికారులు చర్చించారు. అలాంటి పత్రాలకు ఎలాంటి చట్ట బద్ధత ఉండదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించే విద్యాసంస్థలు ఎలాంటి నిబంధనలు అనుసరించాలనే దానిపై వారం రోజుల్లో పూర్తి స్థాయి విధివిధానాలు ఖరారు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో పాటించాల్సిన కొవిడ్‌ నిబంధనలపై గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *