సరికొత్త తరహాలో “గులాబీ” కమిటీలు

సరికొత్తగా పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకోబోతున్నాం  కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :సెప్టెంబర్‌ నెలలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ నెలలో గ్రామ కమిటీలతో పాటు మండల, పట్టణ, జిల్లా కమిటీల ఏర్పాటుతో పాటు సరికొత్తగా పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకోబోతున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం సమగ్రంగా జరిగినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ సంస్థగా ప్రారంభమై నేడు తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ఈరోజు తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఎన్నిక ఏదైనా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తిరుగులేని ఎన్నో ఘనమైన విజయాలను అందుకుని పురోగమిస్తుంది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పార్లమెంట్‌, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఏకపక్ష తీర్పును ఇచ్చి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తున్నారు.

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఘనంగా ప్లీనరీ..
సెప్టెంబర్‌ నెలలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర కమిటీ కూర్పు తర్వాత ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ చివరన లేదా నవంబర్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరగనున్నట్లు చెప్పారు. 2001 నుంచి మొదలు 2019 వరకు కూడా ప్రతీ ఏడాది ప్లీనరీని ఘనంగా జరుపుకున్నాం. అయితే కరోనా వల్ల గత రెండేళ్లుగా ప్లీనరీని ఘనంగా నిర్వహించుకోలేకపోయాం. ఈ నేపథ్యంలో ద్వి దశాబ్ధి ఉత్సవ సభను ఈసారి ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సెప్టెంబర్‌ 2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి పూజ..

దసరా పండుగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్‌కు సెప్టెంబర్‌ 2వ తేదీన సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మొత్తం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ హాజరౌతారని పేర్కొన్నారు.

హుజూరాబాద్‌ ప్రజల ఆశీర్వాదం మాకే..
టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను సాధించినట్లు తెలిపిన మంత్రి కేటీఆర్‌ అభివృద్ధిలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపిందన్నారు. తెలంగాణ ఏర్పడి, పార్టీ ఆవిర్భవించాక ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తమకు చాలా చిన్న విషయం అన్నారు. సమావేశంలో అసలు హుజూరాబాద్‌ అంశమే ప్రస్తావనకు రాలేదన్నారు. హుజూరాబాద్‌లో ప్రజల ఆశీర్వాదం తమకేనన్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత హుజూరాబాద్‌ ఉపఎన్నికపై వ్యూహరచన చేయనున్నట్లు తెలిపారు.

ద‌మ్ముంటే జాతీయ పార్టీలు ద‌ళిత బంధు, బీసీ బంధు అమ‌లు చేయాలి..
ప్రతిపక్షాల పిచ్చి ప్రేలాపనలు తాము పట్టించుకోమని మంత్రి అన్నారు. జాతీయ పార్టీలకు దమ్ముంటే దళితబంధు, బీసీబంధు అమలు చేయాలని సవాల్‌ విసిరారు. కనీసం పేదరిక నిర్మూలనకు కృషి చేయలేని అసమర్థుల ప్రేలాపనలు పట్టించుకోమన్నారు. చిత్రం ఏంటంటే.. 75 ఏళ్లల్లో ప్రభుత్వాలు వాళ్ల చేతుల్లో ఉన్నప్పుడు మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని దద్దమ్మలు, పేదల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావాలన్న ఆలోచన చేయలేని అసమర్థులు పిచ్చి ప్రేలాపనలు పేలితే వాటికి తామెలా స్పందిస్తామన్నారు. సమాజంలో బాటమ్‌ ఆఫ్‌ ది పిరమిడ్‌లో అట్టడుగున ఉన్న దళిత జాతిని పైకి తీసుకువచ్చేందుకే సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారన్నారు. కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న జాతీయ పార్టీల నాయకులు వాళ్లకు చేతనైతే, దమ్ముంటే దళితబంధు గానీ, బీసీ బంధు గానీ అమలు చేయాలన్నారు. పనికిమాలిక ప్రతిపక్షాలు, పనిలేని కొందమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విమర్శలను తాము పట్టించుకోమన్నారు. తమ పాలసీ ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయం సాధిస్తే దేశం మొత్తం మనవైపు చూస్తదని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *