అడిగినంత ఇచ్చుకో… అందినకాడికి తవ్వుకో

మూడు రశీదులు…ఆరు ట్రిప్పులు

*కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక దందా*

ములుగు, అక్షిత బ్యూరో : ఇసుక మాఫియా నీకింత నా కింతగా రాజ్యమేలుతుంది. జిల్లాలో అక్రమ ఇసుకవ్యాపారం మూడు బకిట్లు ఆరు ట్రిప్పులుగా అధికారుల అండదడలతోనే వర్థిల్లుతుంది. అసలు అధికారులను లెక్కచేయకుండా, అక్రమాలకు పాల్పడుతున్నా,కనీసం కన్నెత్తి చూడకుండా, అక్రమార్కులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నకూడా చర్యలు తీసుకోకుండా తాత్పర్యం చేస్తుండడం తో తెర వెనుక కాసులు భారీగానే చేతులు మారి ఉంటాయని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.వివరాల్లోకి వెళ్లితే రోజువారీగా ఆదాయం వేలల్లో వస్తుండడంతో మంగపేట మండలంలోని మంగపేట,రాజుపేట,మల్లూరు,బోరు నర్సాపురం తదితర గ్రామాలకు చెందిన కొందరు ట్రాక్టర్ యజమానులు ఇసుక అక్రమదందాను స్థానిక అధికారుల అండతో వ్యాపారంగా ఎంచు కుని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.గృహ నిర్మాణం,సీసీరోడ్ల నిర్మాణం తదితర అవసరాల పేరుతో ఒకటి రెండు ట్రాక్టర్ ట్రిప్పులకు అనుమతులు తీసుకుంటూ మండల కేంద్రంలోని గౌరారం వాగు, మల్లూరు వాగు,రాజుపేట,ముసలమ్మవాగు,పాలాయిగూడెం,రమనక్కపేట సమీపంలోని గోదావరి నుంచి ట్రాక్టర్లతో వంద లాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.అక్రమ ఇసుక దందాకు సహకరిస్తున్న అధికారులకు రోజుకు ఒక్కో ట్రాక్టర్ కు గాను రూ.1000 వరకు ముట్టజెబుతున్నారని, రోజు వారీగా అక్రమ ఆదాయం రూ.30 – 50 వేల వరకు సమకూరుతున్నట్లు కిందిస్థాయి సిబ్బంది బాహాటంగానే చెప్తున్నారు.

*అనుమతులు లేకుండా రోడ్ల నిర్మాణం*

పాలాయిగూడెం,రమణక్కపేటలో సమీపంలోని గోదావరి నదిలో మిర్చికల్లాల పేరుతో అక్రమంగా రోడ్లు ఏర్పాటుచేసి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం ప్రజలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తుంది.అంతే కాకుండా గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు రెవెన్యూఅధికారులు అనుమతులు ఇవ్వడం మరో విశేషం.ఈ క్రమంలోనే గత నెల రోజుల క్రితం గోదావరి నుంచి రాత్రివేళల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను అప్పటి ఎస్సై శ్రీనివాస్ పట్టుకుని కేసు నమోదు చేశారు.

*బ్లాక్ లో ఇసుక డీడీ లు*

మండలంలో బ్లాకులో ఇసుక డీడీల వ్యాపారం జోరుగా సాగుతోంది.ఒక ట్రాక్టర్ ట్రిప్పు ఇసుకను తరలించేందుకు రెవెన్యూ అధికారుల నుంచి ఇసుక అనుమతి పొందేందుకు కలెక్టర్ పేరిట ఏదైనా బ్యాంకులో రూ.300 చలాను ద్వారా చెల్లించిన డీడీని రెవెన్యూ అధికారులకు అప్పగించాల్సి ఉంది.మండలంలో బ్యాంకు అధికారులు డీడీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.దీంతో కొందరు మీసేవా కేం ద్రాల నిర్వాహకులు,కిరాణా షాపుల,సూపర్ మార్కెట్ నిర్వాహకులు వరంగల్,భూపాలపల్లి,ములుగు వంటి ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో డీడీలను తీసుకువచ్చి రూ.1800 విలువ గల డీడీని రూ.2,100,రూ2,250 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు.ఇలా రెండు ట్రిప్పుల ఇసుకకు అనుమతి పొంది రోజంతా ఇసుకను తరలిస్తూ అవసరమైనవారికి ఒక్కోట్రిప్పును రూ.1500 నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఇప్పటికైనా మండలంలో అక్రమ ఇసుకదందాపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి పోలీసుల ప్రమేయంతో అక్రమ ఇసుకదందాకు అడ్డుకట్టవేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.అక్రమ ఇసుక దందా కారణంగా తమ అవసరాలకు ఇసుకను కొనుగోలు చేయలేక పోతున్నామని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుకదందాకు మరిగిన కొందరు ట్రాక్టర్ యజమానులు సిండికేటుగా ఏర్పడి రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్ట చెబుతూవారికి తప్ప ఇతరులకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై కలెక్టర్ స్పందించి స్థానిక అవసరాలకు వినియోగించుకునే ప్రజలకు తప్పా అక్రమ ఇసుకదందా కొనసాగిస్తూ ఇసుక వ్యాపారం చేస్తున్నవారికి అనుమతులు నిలిపి వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *