కాలినడకే… కనా కష్టం

*దూరం 3 కిలో మీటర్లు-ప్రయాణం 30నిమిషాల పైనే…!*

*పాలకుల అభివృద్ధి మాటలు నీటి మీద రాతలేనా…?*

*బంగారు తెలంగాణాలో రాళ్లు తేలిన రహదారులు…!*

*జగన్నాథపురం నుండి రేపాల వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బీ రహదారికి మోక్షం ఎప్పుడు…?*

మునగాల, అక్షిత న్యూస్ :

మండల పరిధిలోని జగన్నాథపురం నుండి రేపాల వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బీ రహదారి గుంటల మయంగా మారి శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాథుడు లేడని రెండు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఈ రహదారిలో భారీ వాహనాల సంగతి దేవుడెరుగు కనీసం ఆటోలు,ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం నిత్యకృత్యంగా మారింది.కాలి నడకన వెళ్లే వారికి కూడా నరకం కనిపిస్తుందని జగన్నాథపురం,
రేపాల గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ రహదారి గుండా రేపాల,సీతానగరం గ్రామాల ప్రజలు, రైతులు వివిధ అవసరాల దృష్ట్యా పక్క మండలం నడిగూడెం మరియు ఇక్కడి ఖమ్మం ప్రధాన వ్యవసాయ మార్కెట్ కి నిత్యం వెళుతుంటారు. జగన్నాథపురం మరియు నడిగూడెం మండలంలోని వేణుగోపాలపురం, కేశవాపురం, కరివిరాల,కోడిపుంజుల గూడెం,సిరిపురం తదితర ప్రాంతాల నుండి రేపాల గ్రామానికి వస్తుంటారు.రేపాల గ్రామంలో ప్రాథమిక, ఆరోగ్య కేంద్రం, పశువుల ఆసుపత్రి, మీ సేవా,కెనరా బ్యాంక్ వంటి సౌకర్యాలు ఉండటంతో ప్రతి దానికీ ఆయా గ్రామాల ప్రజలు, రైతులు రేపాలకు వస్తుంటారు.రేపాల నుండి మండల కేంద్రం మునగాల, జిల్లా కేంద్రమైన సూర్యాపేటకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ రహదారి పొడవునా గుంతలు ఏర్పడి,పూర్తిస్థాయిలో కంకర తేలి ఉండటంతో రాకపోకలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్నాథ పురం గ్రామం నుండి కిలో మీటర వరకు చెరువు కట్టపై ఉన్న రహదారి పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారై బాటసారులకు,ద్విచక్ర వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. జగన్నాథపురం నుండి రేపాలకు 3 కిలో మీటర్ల ప్రయాణం 30 నిమిషాలకు పైగా పడుతుందంటే ఈ రోడ్డు మీద ప్రయాణం ఎంత దౌర్భాగ్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సుమారు 15 సంవత్సరాల క్రితం వేసిన తారు రోడ్డుపై ఇప్పటి వరకు కనీస మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం విస్మయానికి గురి చేస్తోందని ఈ ప్రాంత ప్రజలు,ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడినా కనీసం ఆ గుంతలకు మరమ్మతులు చేయాలన్న సోయి లేకపోవడంతో, రోడ్డంతా కంకర పరుచుకుని ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు కంకర రాళ్లను తప్పించే క్రమంలో గుంతల్లో పడి తీవ్ర గాయాలపాలైన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జగన్నాథపురం నుండి రేపాల వరకు ఉన్న ఆర్ అండ్ బీ రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి,నూతన తారు రోడ్డు వేసి ప్రజల ఇబ్బందులను తొలిగించాలని కోరుతున్నారు. రాష్ట్రం మారింది, ప్రభుత్వాలు మారాయి,పాలకులు మారారు,స్థానిక ఎమ్మెల్యేలు మారారు కానీ మా ఊరి రోడ్డు మారటం లేదని జగన్నాథపురం గ్రామ మాజీ సర్పంచ్ వీరబోయిన వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నిసార్లు ఎంతమంది ప్రజా ప్రతినిధులకు,అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడు కరువయ్యారని అన్నారు.ఏ అవసరం వచ్చినా రేపాలకు, అక్కడి నుండి మునగాల మండల కేంద్రానికి,సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది.కానీ ఈ రోడ్డుపై ప్రయాణం చేయలేక నడిగూడెం నుండి వయా బరాఖత్ గూడెం మీదుగా చుట్టూ తిరిగి వ్యయప్రయాసలకు గురవుతూ మునగాలకు,సూర్యాపేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.2015 లో వేసిన రోడ్డుకు ఇప్పటి వరకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత శాఖా అధికారులు చొరవతీసుకొని ఈ రోడ్డును అభివృద్ధి పరిచి నూతన రోడ్డు పనులు చేపట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *