దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి

కాంగ్రెస్ ను వీడి గులాబీలో చేరిన ఎమ్మెల్యేలకు సవాలు

ఏఐసిసి నేత, ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

కాంగ్రెస్ పార్టీని వీడి అధికార టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రేవంత్, కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరైతే వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ మీడియా ముఖంగా సవాల్ విసిరారు.

దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి..

పార్టీ మారిన ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడుతున్నారు. కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓటుకు నోటు అని మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇప్పుడు వారిపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. అందుకే వారిని తరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ నుంచి గెలవాలి. తప్పుడు కూతలు మానుకోకుంటే ప్రజలే రాళ్లతో కొడతారు. కార్యకర్తల అభీష్టం మేరకే రేవంత్‌కు పీసీసీ పదవి ఇచ్చారు అని సీతక్క చెప్పుకొచ్చారు.

రేవంత్ ఏమన్నారు..!?

కాగా.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే స్పీకర్‌పైనా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పిన విషయం విదితమే. సీఎం కేసీఆర్‌, సంతలో పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని రేవంత్ సవాల్‌ చేశారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే, అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గుండాలని రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై కొందరు పార్టీ మారిన, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *