రాజ్యాధికారం దిశగా అడుగులు

 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : బహుజన రాజ్యాధికారం దిశగా అడుగులు.ఏనుగు గుర్తు పైనే పైనే ప్రగతి భవన్ వెళ్ళాలి. గులాబీ తెలంగాణ కాదు.నీలి తెలంగాణ రావాలి. రెండేళ్లలోనే ఇది నిజం చేయాలి.మన భవిష్యత్ ను మనమే నిర్ణయించుకోవాలి. ఇక మోసపోయింది. అవమాన పడింది చాలు. మనమే పాలకులు కావాలి. ఇంటింటికి వాడ వాడకు తిరగండి. బహుజన వాదాన్ని ప్రచారం చేయండి. అంతవరకు నిద్ర పోవద్దు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, అగ్రవర్ణాల్లో పేదలు రాజ్యమేల బోతున్నారు. అక్రమంగా దోచుకున్న వేల కోట్ల ప్రజాధనాన్ని వాపస్ తీసుకువస్తాం” అని బహుజనసమాజ్ పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నవి. ఆయన అతి విశ్వాసానికి అద్ధం పడుతున్నవి.

దక్షిణ భారత దేశంలో బహుజనసమాజ్ పార్టీ ఉనికి ఎక్కడా లేదు. ఇప్పుడు తెలంగాణలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పుణ్యమా అని బీఎస్పీ పేరు వినిపిస్తున్నది.తెలంగాణ ప్రజలకు బీఎస్పీతో కొంత పరిచయం ఉన్నది.ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటు కాగజ్ నగర్ కోనప్ప బీఎస్పీ నుంచి టికెట్ తెచ్చుకొని 2014 ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం ఇద్దరు కూడా టీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు. కాగా ప్రవీణ్ కుమార్ బహుజనసమాజ్ పార్టీలో చేరడం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని ఆయన సభలూ, సమావేశాలూ, ప్రసంగాల తీరు తెన్నులను బట్టి అర్ధం చేసుకోవచ్చు. దాదాపు ఏడాది కాలంగా ఆయన దీనిపై రాజకీయంగా భారీ కసరత్తు చేశారని పోలీసులు చెబుతున్నారు. దళిత వర్గానికి బలమైన నాయకుడిగా ఎదగాలని ప్రవీణ్ కుమార్ ప్రణాళికలు వేసుకున్నట్టు కనిపిస్తోంది.’ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాజ్యాధికారం రాద’ని ప్రవీణ్ పిలుపునిచ్చారు.గురుకుల పాఠశాలల సంస్థ కార్యదర్శిగా పనిచేస్తూనే ” స్వేరోస్‌” అనే సంస్థను బలోపేతం చేశారని తెలుస్తోంది. ‘స్వేరోస్’ భావజాలం చాప కింద నీరులా విస్తరించేలా ప్రవీణ్ కుమార్ ప్రయత్నించారు. వీరే ప్రవీణ్ కుమార్ బలగం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 63,60,158 మంది దళితులున్నారు. జనాభాలో 17.5 శాతం. రాజకీయ పార్టీల భవితవ్యాన్ని మార్చేయగల బలం ఈ సెక్షన్ కు ఉన్న మాట నిజం. దళిత రాజకీయ శక్తిగా ఎదగడానికి గాను చాలా కాలం నుంచే మాజీ ఐపీఎస్ అధికారి గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నవి.

ప్రవీణ్ కుమార్ నినాదాలు బాగానే ఉన్నాయి. ఆయన ప్రసంగాలు ఉత్తేజభరితంగా సాగుతున్నవి.కానీ అవి ఓట్లుగా మారేదెలా? ఏ మంత్రంతో దళిత బహుజన సమాజాన్ని ‘రాజ్యాధికారం ‘ దిశగా నడిపించగలరు? దళితులు, బిసిలు,ఇతర బలహీన వర్గాలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లోని పేద ప్రజలను సమీకృతం చేయగలిగిన ‘రోడ్ మ్యాపు’ ఏమిటి? రెండేళ్లలోనే ఏనుగు గుర్తుపై ప్రగతి భవన్ కు చేరుకోవడం సాధ్యమా? అంటే తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడం,ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడం ఆచరణలో సాధ్యమా? ఇంకా ఇరవై ఏళ్ల పాటు తమదే అధికారమని టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ కుండబద్దలుగొట్టి చెబుతున్నారు.119 లో 72 సీట్లు తమవేనని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు.తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ నెంబర్ 60 దాటాలి.ప్రవీణ్ కుమార్ మాటలు నిజం కావాలంటే,ఆయన కల సాకారం కావాలంటే దళిత,బహుజనుల విప్లవమే రావాలి.అణగారిన వర్గాల్లో తిరుగుబాటు రావాలి.అప్పుడే మిగతా అన్ని పార్టీలను తొక్కి ‘ఏనుగు’ ప్రగతి భవన్ కు చేరుకోగలదు.

రాజ్యాధికారం ఎవరికి వస్తుంది ?ఎలా వస్తుంది ? ‘ రాజ్యాధికారం మాస్టర్ కీ ‘, ‘ రాజ్యాధికారం సర్వరోగ నివారిణి ‘, ‘ దళితుల లక్ష్యం రాజ్యాధికారం ‘, ‘ రాజ్యాధికారానికి రాని జాతి అంతరించి పోతుంది ‘… దళితమేధావులచే విస్తృతంగా ప్రచారం చేయబడుతున్న సిద్దాంతం. వినటానికి ఇది తీయగా, వినసొంపుగా ఉంటుంది.‌ అనుభవించడానికి ఆహ్లాదకరంగా, ఆప్యాయంగా ఉంటుంది. కాని ఆచరణకు సాధ్యమా ! అన్నది ప్రధాన ప్రశ్న? రాజ్యాధికారం ఆదర్శంగా పెట్టుకోవడంలో తప్పులేదు. కాని అది ఆచరణసాధ్యం అయ్యేదిగా ఉండాలి.
” ఆదర్శం అన్నది ఆచరణ సాధ్యం అన్న హామీని నెరవేర్చగలిగి ఉండాలి. కేవలం ఊహాజనితమైన దానిని మనం ఆదర్శంగా పెట్టుకొన కూడదు ” అని అంబేద్కర్ అన్నారు. అసలు రాజ్యాధికారం అంటే ఏమిటి ? ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం అనేది ఎవరి చేతిలో ఉంటుంది ? ఒక వ్యక్తి చేతిలో ఉంటుందా ? ఒక కులం చేసి చేతిలో ఉంటుందా ? లేక ఒక వర్గం చేతిలో ఉంటుందా ? ఈ రాజ్యాధికారాన్ని ఎవరు సాధిస్తారు ? SC లా, BC లా, ST లా, లేక మైనారిటీలా ? ఎలా సాధిస్తారు ? SC లు అయితే మాలలా ? లేక మాదిగలా ? ఎలా సాధిస్తారు ? SC లు రాజ్యాధికారం సాధించడానికి వారికి ఉన్న అవకాశాలు,శక్తులు ఏమిటి ?
పెత్తందారీ కులాలకు లేని అవకాశాలు, శక్తి సామర్థ్యాలు ఎస్.సీ.లకు ఏమున్నవి ?మాలలంటే మాదిగలకు పడదు. మాదిగలంటే మాలలకు పడదు. మాలమాదిగలంటే BC లకు పడదు. మరి రాజ్యాధికారం ఎలా సాధిస్తారు ? BC లు అయితే ఏ BC కులం సాధిస్తుంది ? ఎలా సాధిస్తుంది ? వారికున్న అవకాశాలు, శక్తులు ఏమిటి ? రాజ్యాధికారం సాధించడానికి నాయకత్వం వహించేది ఎవరు ? మాలలా ? మాదిగలా ? BC లా ? BC ల నాయకత్వం అయితే మాల మాదిగలకు ఒరిగేది ఏమిటి ? BC లు కులనిర్మూలనకు అంగీకరిస్తారా ? మాల మాదిగలు సారధ్యం వహిస్తే BC లు, SC ల నాయకత్వాన్ని అంగీకరిస్తారా ? ఎస్.సీ.ల కింద BC లు పనిచేస్తారా ?మనిషి తనకంటే అధముణ్ణి, అసమర్థుణ్ణి, అవివేకిని తన నాయకుడుగా, రోల్ మోడల్ గా అంగీకరిస్తాడా ?

0.5 శాతం జనాభా కూడా లేని వెలమలు ‘రాజకీయ అధికారం’ఎలా చేబట్టగలిగారు? కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడిపిన వేళ సబ్బండ వర్ణాలు ఆయనను అనుసరించినవి.ఆయన నాయకత్వాన్ని ఆమోదించినవి.ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కేసీఆర్ అధికారం చేబట్టిన వేళ కానీ, యేడేండ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఈ తరుణంలో గానీ దళిత బహుజనులంతా ఏమయ్యారు? వారిలో చైతన్యం లేదా? తిరుగుబాటు ఆలోచనలు లేవా? ప్రవీణ్ కుమార్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని అనుకోవాలా? తెలంగాణ ప్రజల నాడి కేసీఆర్ కన్నా ఎక్కువగా తెలిసినవారు లేరు.ఆయన 2001 నుంచి కాలికి బలపం కట్టుకొని,ఊరూ వాడా తిరిగారు.ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకున్నారు. అందులో ప్రాధాన్యమున్న అంశాలను ఆయన ప్రభుత్వం ఎజండాపై తీసుకురాగలిగారు. తాగు, సాగునీరు, విద్యుత్తు,రైతాంగ సమస్యలు… ఇవన్నీ క్షేత్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని కేసీఆర్ కు కంఠస్తమయ్యాయి.మనం ఏ అర్ధరాత్రి నిద్ర లేపినా తెలంగాణకు సంబంధించిన ఏ విషయంపైన అయినా కనీసం గంటకు పైగా సోదాహరణంగా మాట్లాడగలిగిన, మెప్పించగలిగిన నైపుణ్యం ఆయనకు ఉన్నది.అన్ని రంగాలపై ఆయన సాధించిన పట్టు,జ్ఞాపక శక్తి, సాధికారత వల్ల ఆయనకు సమఉజ్జీగా తెలంగాణ రాజకీయ రంగస్థలంపై మరొకరు లేకుండా పోయారు.జనాభాలో కేసీఆర్ పుట్టిన సామాజిక వర్గ శాతమెంత అన్నది కాదు,ప్రజల్ని పాలించగల శక్తి, సామర్ధ్యాలు, చాకచక్యమూ,చాణక్యతనమూ ఆయనలో పుష్కలంగా ఉండడమే కారణం.

ఆయనను ఢీ కొనాలంటే ఆ స్థాయి వ్యూహమూ, బలమూ ఉండాలి.ప్రవీణ్ కుమార్ కు అవి ఉన్నాయా,లేదా అన్నది ప్రశ్నార్థకమే ! కులం పునాదులపై ఒక జాతిని,ఒక నీతిని నిర్మించలేమని అంబెడ్కర్ స్వయంగా చెప్పారు.మరి దళితులు,బహుజనులంటూ చీలికలు తేవడం,లేదా వారిలో అణగారి ఉన్న శక్తిని కూడగట్టడం సాధ్యమవుతుందా? రాజ్యాధికారమన్నది ఎన్నికల రణరంగంలో ఎన్నో కుయుక్తులు, కుతంత్రాలు, మోసాలతో తప్ప సులభంగా రాదు.జనాభాలో ఎంత శాతం ఉన్నారన్నదానికన్నా ఎన్ని వర్గాలను తమ వైపునకు హైజాక్ చేసుకోగలిగారన్నదే ముఖ్యం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *