Rajath Kumar Election Code

కోడ్ దాటితే కొరడా

తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల కమిషన్ వేగాన్ని పెంచింది. శాంతిభద్రతలు, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇప్పటికే ప్రాథమికంగా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నిత్యం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. అసెంబ్లీ రద్దయినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో దానిని ఎవరూ ఉల్లంఘించకుండా నిరోధించడంపై దృష్టిసారించింది. నిబంధనలు అతిక్రమించినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. దీనిపై కలెక్టర్లు నిశితంగా దృష్టిసారించి ఉల్లంఘనలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

కొనసాగుతున్న పోస్టర్ల తొలగింపు
ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ఫొటోలను, కూడళ్లలోని హోర్డింగులు, కటౌట్లు, బ్యానర్లను తొలగించే పని కొనసాగుతున్నది. ప్రభుత్వ భవనాలు, బస్సులు, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఉన్న పోస్టర్లను, గోడరాతలను చెరిపేస్తున్నారు. జిల్లాస్థాయిలో ఎన్నికల అధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వాధికారులు మినహా మిగిలినవారెవరూ అధికారిక వాహనాలను వాడకూడదని, దీనిని ఉల్లంఘించేవారిపై కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.

ఫిర్యాదులపై తక్షణ చర్యలు
ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను 24 గంటలూ స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా 1950 టోల్‌ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేసేందుకు వీలుకల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు తొమ్మిది తనిఖీ బృందాలను ఏర్పాటుచేశారు. దీంతో నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్టపడనున్నది.

సమకూరిన సిబ్బంది
రాష్ట్రంలో మొత్తం 32,574 పోలింగ్ కేంద్రాలకు బూత్‌లెవల్ ఆఫీసర్లను నియమించారు. అడిషనల్ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు, సపోర్టింగ్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ దాదాపు పూర్తిస్థాయిలో సమకూరారు. మరో 12 మంది విధుల్లో చేరితే సరిపోతుంది. ఎన్నికల ప్రక్రియలో అనుభవమున్న అధికారులను తీసుకుని అన్ని పనులను వేగవంతం చేస్తున్నారు.

ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై సీఈవో రజత్‌కుమార్ సమీక్ష
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతలు, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. కోడ్ ఉల్లంఘించినవారిపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. నగదు, మద్యం సరఫరాపై నిరంతర నిఘా ఉంచాలని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అలజడి సృష్టించిన వ్యక్తులు, సమస్యాత్మక ప్రాంతాల వివరాలను సమర్పించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. కేంద్ర బలగాలను వినియోగించుకోవడం, సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని మోహరించడంపై ప్రత్యేకంగా చర్చించారు. లైసెన్స్‌డ్ ఆయుధాలున్నవారి గురించి ఆరా తీయడంతోపాటు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారితోపాటు కేసులు నమోదుచేసి రోజువారీగా నివేదికలను ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించినట్టు తెలిసింది. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Tags:Election ,Rajath Kumar ,Election Code ,Video Conferencing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *