రైతు బీమాకు రూ. 800 కోట్లు విడుద‌ల‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : రైతు బీమాకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.800 కోట్లు విడుద‌ల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతుబీమా కోసం రైతుల పక్షాన చెల్లించాల్సిన ప్రీమియం కోసం రూ. 800 కోట్లను ముందస్తుగా విడుదల చేసింది.ఈ మేరకు బడ్జెట్‌ విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రీమియం గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తుంది. 14వ తేదీ నుంచి కొత్త ప్రీమియం అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల తరుపున ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన ప్రీమియం కోసం ప్రభుత్వం ముందస్తుగా రూ. 800 కోట్లను విడుదల చేసింది. రైతుబీమా పథకంలో భాగంగా రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ రైతులపై ఆర్థిక భారం మోపొద్దునే ఉద్దేశంతో రైతుల తరుపున ప్రభుత్వమే మొత్త ప్రీమియం డబ్బులను చెల్లిస్తుండడం గమనార్హం.

గతేడాది(2020-21) కోసం 32.73 లక్షల మంది రైతులకు రూ. 3486 చొప్పున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. 2018-19వ సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏ కారణంతో అయినా సరే రైతు చనిపోతే… ఆ రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తోంది. తద్వారా ఆ రైతు కుటుంబం ఆర్థిక నిలదొక్కుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.

కొత్త దరఖాస్తులకు 11వరకు అవకాశం..
2021-22 సంవత్సరానికి గానూ అర్హులైన కొత్త రైతులు రైతుబీమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ నెల 11వ తేదీ వరకు సంబంధిత‌ ఏఈవోలకు దరఖాస్తు అందజేయాలని సూచించింది.

దరఖాస్తుదారులు కచ్చితంగా 18-59 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే 14-08-1964 నుంచి 14-08-2003 మధ్య జన్మించి ఉండాలి. ఆధార్‌ కార్డుపై ఉన్నటువంటి పుట్టిన తేదీ ఆధారంగానే వయస్సును నిర్ధారిస్తారు. కొత్త రైతుల పేరిట 03-08-2021 తేదీలోపు వారి పేరుపై భూమి రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి.
రైతే స్వయంగా వచ్చి ఏఈవోకు దరఖాస్తు అందించాలి. దరఖాస్తుతో పాటు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, నామినీ ఆధార్‌ కార్డు జిరాక్సులు అందించాలి. ఇప్పుడు రైతుబీమా దరఖాస్తు చేసుకోని పక్షంలో మళ్లీ వచ్చే సంవత్సరం వరకు దరఖాస్తుకు అవకాశం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *