రైతుబంధుకు, రైతు ద్రోహికి మ‌ధ్య పోటీ

మంత్రి హ‌రీశ్‌రావు

జ‌మ్మికుంట, అక్షిత ప్రతినిధి : హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌లో రైతుబంధుకు, రైతు ద్రోహికి మ‌ధ్య పోటీ ఉండ‌బోతుంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కార్మిక బంధువులు గెలవాలా.. కార్మిక ద్రోహులు గెలవాలా మీరే ఆలోచించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి సూచించారు. జ‌మ్మికుంట‌లోని న్యూమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీపీఐ నేత కాయిత లింగారెడ్డి, టీడీపీ నేత‌ల అప్పాల మ‌ధు, ఏఐటీయూసీ నేత ద‌మ్ముల రామ్మూర్తితో పాటు వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ మంత్రి హ‌రీశ్‌రావు గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

అనంత‌రం మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ అని స్ప‌ష్టం చేశారు. అసలు ఇక్కడ కాంగ్రెస్ ఉందా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ గెలిచాకా రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం జలాల‌తో పాటు 24 గంట‌ల నాణ్య‌మైన‌ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్కెట్ యార్డులు రద్దు చేశారు. రైతులు ధర్నాలు చేస్తే.. రోడ్లపై మేకులు కొట్టి, రబ్బరు బుల్లెట్లతో, బాష్పవాయు గోళాలతో దాడి చేశార‌ని మోదీ ప్ర‌భుత్వంపై హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఎరువుల ధరలు పెంచి, రైతులపై భారం మోపేవారు రైతు ద్రోహులు కాదా? అని ప్ర‌శ్నించారు. మద్ధతు ధర, మార్కెట్ కావాలని కోరితే రైతుల తలలు పగులగొట్టించారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి కరెంట్ భారం పెంచాలని చూస్తున్నారు. బీజేపీ వాళ్లు కరెంట్ లెక్కలు వేస్తుంటే.. కేసీఆర్ ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. మ‌రి మీరు ఎవ‌రి వైపు ఉంటారో ఆలోచించుకోవాల‌ని మంత్రి సూచించారు.

ఇదెక్క‌డి క‌థ‌

బీజేపీలో చేరిన ఈటల.. మాటలన్నీ ఎర్రజెండా మాటలు మాట్లాడుతున్నాడు. ఇదెక్కడి కథ. కాషాయ జెండా చేతిలో పట్టుకుని.. ఎర్రజెండా డైలాగులు కొడితే ఎవరూ నమ్మరు. ప్రజలు అమాయకులు కారు అని హ‌రీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్‌లో ఏ అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్‌తో మాత్రమే సాధ్యం అని స్ప‌ష్టం చేశారు. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా? ప్రజల ప్రయోజనం ముఖ్యమా? ఆలోచించుకోవాల‌న్నారు. బీజేపీ గెలిస్తే ఈటల ఒక్కడికే ప్రయోజనం క‌లుగుతుంద‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

ప‌ని చేసే వాళ్లు గెల‌వాలి
ప్ర‌జాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. పనిచేసే వాళ్లు గెలవాలి అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. 9 నెలల క్రితం దుబ్బాకలో గెలిచినాయన ఏం చేసాడు. ఆయన కూడా గెలవకముందు ఎన్నో చెప్పాడు. రైలు తెస్తా, అది తెస్తా అంటూ చెప్పిన ఆయన నోటికే మొక్కాలి… ఏవోవో చెప్పాడు. ఒక్కటీ రాలేదు. పసుపు బోర్డు తెస్తానని నిజామాబాద్ ఎంపీ బాండ్ పేపర్ రాయించి ఇచ్చాడు. రెండేళ్లైంది ఏమైంది? ప్రజల బాధను తన బాధగా భావించే వ్యక్తి కేసీఆర్.. అందుకే ప్రజల బాధలు దూరం చేసే అనేక పథకాలు తెచ్చాడు. కానీ ఈటల రాజేందర్ మాత్రం తన బాధను ప్రజల బాధగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *