గర్వంగా… తలెత్తుకునేలా

తెలంగాణ ఖ్యాతి…దశ దిశలా
చేనేతకు చేయూత
రమణ కమిట్ మెంట్ నాకు తెలుసు
సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : మాది తెలంగాణ అంటూ ప్రతిఒక్కరూ గర్వంగా తలెత్తుకొని చెప్పుకొనేస్థాయికి రాష్టాన్ని తీసుకొస్తామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో అనేక అంశాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు. చేనేతవర్గాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆ వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం ఉండబోతున్నదని ప్రకటించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌ రమణకు సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రజల అండదండలు, దీవెనలు, ఆశీర్వాదం ఉన్నంతవరకు నాలైన్‌ను ఎవ్వరూ మార్చలేరని.. కలలుగన్న తెలంగాణను సాధించే వరకు విశ్రమించను’ అని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

చేనేతవర్గానికి అండగా*

చేనేతవర్గం అనుభవిస్తున్న బాధలను పరిష్కరించడానికి రాష్ట్రప్రభుత్వం కొంతప్రయత్నం చేస్తున్నది. ఈ వర్గానికి దేశంలో ఎక్కడాలేని పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. కానీ, ఇంకా జరగాల్సి ఉన్నది. చేనేత కార్మికులు ఏ కారణంగా చనిపోయినా వారి కుటుంబానికి బీమా అందజేస్తామని ఈ మధ్యే సిరిసిల్ల జిల్లాలో ప్రకటించా. ఇది త్వరలోనే అమల్లోకి వస్తుంది. రాష్ర్టాన్ని ఒక గాడిన పెట్టాలని ప్రజలు మాకొక అవకాశమిచ్చారు. అధికారం సద్వినియోగం కావాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఎజెండా రూపొందించుకుని.. ఏం జరిగితే బాగుంటుందో నిర్దేశించుకొని మంచిమార్గాన్ని చేపట్టినం. చాలా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.

శాశ్వత పరిష్కారం కావాలి

పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడు సిరిసిల్ల నుంచి వస్తుంటే.. అనేకసార్లు కండ్లలో నీళ్లు తిరిగేది. ‘చేనేత కార్మికులారా సచ్చిపోకండి, ఆత్మహత్యలు పరిష్కారం కాదు’ అని గోడలమీద రాతలు కనిపించేవి. ఈ బాధ పోవాలని అనుకునేవాళ్లం. భూదాన్‌పోచంపల్లిలో ఒక్కరోజులో ఆరుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. జోలె పట్టుకొని నేనే భిక్షాటనచేసి వారి కుటుంబాలకు తలా రూ.50 వేలు ఇచ్చి ఆదుకొన్నాం. తెలంగాణలో ప్రభుత్వం చేసిన ప్రయత్నంతో కొంత ఉపశమనం లభించింది. కానీ, దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. చేనేత సంఘాలు, పవర్‌ లూమ్స్‌ పేరిట రకరకాల కన్‌ఫ్యూజన్లు కూడా ఉన్నాయి. చేనేత కార్మికుల లెక్కలు తీసేటప్పుడు మరమగ్గ కార్మికులను కూడా గుర్తించాలని ఈ మధ్యనే మంత్రి రామారావుకు చెప్పా.

*నా లైన్‌ను ఎవరూ మార్చలేరు*

గౌరవంగా బతికే పరిస్థితి వస్తది. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట, పరకాల ప్రాంతాలకు చెందిన లక్షల మంది సూరత్‌లో పనిచేస్తున్నారు. సూరత్‌లో సతీశ్‌ టీఆర్‌ఎస్‌ జెండా పట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక వరంగల్‌ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి, కొంతమంది ఎంపీలను సూరత్‌కు పంపించిన. తర్వాత 50 మందిని ఇంటికి పిలిపించుకొని, భోజనం పెట్టి రోజంతా వారితో మాట్లాడా. అక్కడ ఆరేడు వేల రూపాయలు కూడా రావడంలేదని చెప్పారు. మరి అక్కడెందుకు ఉంటున్నరని అడిగితే.. అక్కడ ఏడాదంతా పనిదొరుకతది, ఇక్కడ కొన్ని రోజులే దొరుకతదని చెప్పారు. మన దగ్గర టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తే రెండున్నర లక్షల కుటుంబాలు తిరిగి వస్తామన్నాయి. అట్లనే అని చెప్పిన. వరంగల్‌లో దాదాపు వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటుచేసినం. దానిలో నిన్న మొన్ననే మూడువేల కోట్ల పెట్టుబడులు పెడుతామని ముందుకొచ్చారు. పెద్దపెద్ద స్పిన్నింగ్‌ మిల్లులు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే కొద్దిరోజుల్లో చేనేత బిడ్డలకు అద్భుతమైన ఉపాధి దొరుకుతుంది. చేనేత రంగంలో ఇప్పటితరం, ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఫ్యాషన్లు ఆలోచించాలి. రాబోయే రోజుల్లో చేనేత వర్గం కూడా గౌరవంగా బతికే పరిస్థితి వస్తది. త్వరలోనే చేనేతరంగంపై ప్రముఖులతో సమావేశం ఏర్పాటుచేస్తాం. అందరం కలిసి కూర్చోని చర్చిద్దాం. చేనేతశాఖ అధికారులకు కూడా చెప్పి పెట్టాను. వారు కూడా అదేపనిలో ఉన్నారు.

ఉద్యోగులకు నంబర్‌వన్‌ జీతాలు*

తెలంగాణ వస్తే ఉద్యోగస్తులందరికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా నంబర్‌వన్‌ జీతాలు ఇచ్చే పరిస్థితి వస్తదని ముందేచెప్పిన. అది నిజమైంది. మన రాష్ట్రం బంగారు తునక.. మనం పరాధీనమై నలిగిపోయినం తప్ప, మనకు వనరుల్లేక కాదు. నిన్న 40 ఎకరాల భూమి అమ్మితే రెండువేల కోట్ల రూపాయలు వచ్చినయి. అది ప్రజాధనం. ఆ డబ్బును మా చేనేత వారికోసం, మా దళితుల కోసం వాడుకుంటం. ప్రతి కార్మికుడు, ప్రతిఒక్కరి సంక్షేమం కోసం వాడుకుంటం, మాది తెలంగాణ అని ప్రతిఒక్కరూ తలెత్తుకొని గర్వంగా చెప్పుకునేస్థాయికి తీసుకొస్తాం. గతంలో తెలంగాణలో వరి ధాన్యం అమ్మకాల ద్వారా జీఎస్డీపీకి సమకూరే ఆదాయం రూ.12వేల కోట్లకు మించకపోయేది, కానీ ఇప్పుడు వస్తున్న ఆదాయం రూ.51 వేల కోట్లు. గుణాత్మకమైన మార్పు ఇది. మనం ధనిక రాష్ట్రంగా ఉన్నం. ఉజ్వల భవిష్యత్‌ ఉంటది.

టీఆర్‌ఎస్‌లో చేరిన వారు
టీటీడీపీ మాజీఅధ్యక్షుడు ఎల్‌ రమణతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో టీడీపీ మాజీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు పీ సాయిరెడ్డి , రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ తాజొద్దీన్‌, తెలుగుయువత జనరల్‌ సెక్రటరీ కరణం రామకృష్ణ, టీటీడీపీ కంటోన్మెంట్‌, మల్కాజిగిరి జనరల్‌ సెక్రటరీ ఎం మధుకర్‌, రాష్ట్రకార్యదర్శి డీ మల్‌రెడ్డి, బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, హుజూరాబాద్‌ సీనియర్‌ నేత బీ శ్రీధర్‌, అఖిల భారత పద్మశాలిసంఘం, చేనేత విభాగం అధ్యక్షుడు ఈ వెంకన్ననేత, బీజేపీ నుంచి గుడాల రాజుగౌడ్‌ తదితరులున్నారు.

*చేనేతవర్గం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం*
తెలంగాణ అభివృద్ధికి సహకారమందించాలని ఎల్‌ రమణ, వారి మిత్రులందరికీ టీఆర్‌ఎస్‌లోకి హృదయపూర్వకమైన స్వాగతం చెప్తున్నా. రమణ నాకు 25 ఏండ్లుగా వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం కమిట్‌మెంట్‌తో పనిచేస్తారు. చాలామంది పార్టీలో చేరుతుంటారు. రమణ చేరుతున్నందుకు చాలా సంతోషం కలిగింది. చేనేతవర్గంలో నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉన్నది. చేనేతవర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కలిగించే విషయంలో త్వరలోనే గుడ్‌న్యూస్‌ అందిస్తానని చెప్తున్నా. టీఆర్‌ఎస్‌ పార్టీకి చేనేతవర్గం నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండేవారు. దురదృష్టవశాత్తు ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం వెలితిగా ఫీల్‌ అయ్యేవాళ్లం. పెద్దజనాభా ఉన్న చేనేతవర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కొన్ని ప్రయత్నాలు చేశాం. ఈమధ్యే గుండు సుధారాణిని వరంగల్‌ మేయర్‌ చేశాం. రాష్ట్ర ఎన్నికలసంఘం కమిషనర్‌గా చేనేతవర్గానికి చెందిన పార్ధసారథిని నియమించాం. కానీ, రాజకీయప్రాతినిధ్యం కూడా తప్పకుండా కావాలి. రమణ రూపంలో మంచి నాయకుడిని చూడబోతున్నారు. చేనేతవర్గానికి అవసరమైన సేవలు ఆయన ద్వారా జరిగేట్టు చేసుకుందాం.

సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష
మంత్రి గంగుల కమలాకర్‌
తెలంగాణ నేల మీద గాలి ఉన్నంతకాలం టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని, తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. బడుగు, బలహీనవర్గాల ఆశాదీపం కేసీఆర్‌ అని కొనియాడారు. సుదీర్ఘకాలంపాటు బీసీల అభ్యున్నతికి పాటుపడిన ఎల్‌ రమణ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నందుకు సంతోషంగా ఉన్నదని చెప్పారు. అందరం కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, విద్యాసాగర్‌రావు, మెతుకు ఆనంద్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.మొండిగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాం. తెలంగాణ వచ్చిననాడు కరెంటు పర్‌క్యాపిటాలో చిట్ట చివరన ఉన్నం. తలసరి విద్యుత్తు వినియోగం 1,070 యూనిట్లుఉండేది. ఇప్పుడు 2,170 యూనిట్లు ఉన్నది. అద్భుతమైన కార్యక్రమం మిషన్‌ భగీరథ. ఇప్పుడు ధరణి ఒక విప్లవం. రైతు నిశ్చితంగా నిద్రపోవచ్చు. ఒక్కొక్కటి చేసుకుంటపోతున్నం. మీ దీవెన, మీ అండదండలు, మీ సహకారం ఉన్నన్ని రోజులు నాలైన్‌ను ఎవ్వరుకూడా మార్చలేరు. వందశాతం గుండెల నిండ ఏ తెలంగాణను అయితే స్వప్నించానో, ఏ తెలంగాణ కావాలని కోరుకున్నానో వందకు వందశాతం సాధించి తీరుతాను. ఈ వయస్సులో నాకు వేరే కాంక్షలు కూడా లేవు. రాష్ర్టాన్ని ఏ పద్ధతిలో అయితే అనుకున్నామో వాటి ఆవిష్కరణ జరిగే వరకు విశ్రమించను. ప్రయత్నం చేస్తూనే ఉంటను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *