ప్రగతి సాధనలో… దేశానికే తలమానికం

ఏడేండ్లలో 70 ఏండ్లలో జరగని అభివృద్ది
సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు
 పండువలా పల్లె ప్రగతి..విప్లవాత్మక మార్పులు

కర్షక దేవాలయాలు ‘రైతు వేదికలు’

మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధనలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గార్ పల్లి గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామాన్ని, ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.అనంతరం ఊట్లపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం 70ఏండ్లలో సాధించాల్సిన అభివృద్ధిని కేవలం ఏడేండ్లలో సాధించిందని కితాబిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు. ప్రపంచ దేశాలను కరోనా కబళించినప్పటికీ స్వరాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం నిధుల కొరతతో నిలిచిపోలేదని అన్నారు. కోవిడ్ లాంటి సంక్షోభంలోనూ గ్రామాల అభివృద్ధికి రూ.339కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.148 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఏడో విడత హరితహారం కార్యక్రమం అద్భుత ఫలితాలను అందిస్తోందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో పండువలా కొనసాగుతోందన్నారు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ సర్కార్ సాకారం చేస్తున్నదని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సరిపడ నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ విడుదల చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో 19,298 ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి నిధుల లేమి వీడిందన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధి నిధిని రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ అందజేయడంతో పాటు డంప్ యార్డ్, వైకుంఠ ధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, కల్లాల నిర్మాణాలు చేపడుతున్నదని అన్నారు. గతంలో కుటుంబంలో ఎవరైనా చనిపోతే ముందుగా చెట్ల దగ్గరో, పుట్టల మధ్యనో, వాగువంకల నడుమనో జాగలు వెతుక్కునే రోజులుండేవని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న వైకుంఠ ధామాల్లో అన్ని వసతులు ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో 12,750 వైకుంఠ ధామాల నిర్మాణానికి రూ.1,554 కోట్లు అంచనా వ్యయంగా ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రభుత్వం వీటిలో రూ.845 కోట్లు ఖర్చు చేసి 8,644 వైకుంఠ ధామాల నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. రైతాంగాన్ని సంఘటితం చేయాలనే సంకల్పంతో రైతు వేదికల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. సాగు బాగుపడాలనే లక్ష్యంతో రైతు వేదికలను నిర్మిస్తోందన్నారు. రైతులంతా ఒకే చోటుకు చేరి వ్యవసాయాన్ని లాభదాయకం చేయాలంటే చేపట్టాల్సిన పద్ధతుల గురించి చర్చించే సదవకాశం లభిస్తుందన్నారు. రైతును రాజును చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. కరోనా లాంటి సంక్షోభంలోనూ ప్రభుత్వం రైతులు పండించే పంటలకు పెట్టుబడిసాయంగా రైతు బంధు విడుదల చేసిందన్నారు. రైతు మృతిచెందితే అతడి కుటుంబం రోడ్డునపడే దుస్థితి నెలకొనవద్దనే ఉద్దేశంతో రైతు బీమా పథకం ద్వారా నామినీకి రూ.5లక్షల చెక్కును ప్రభుత్వం అందజేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక మార్పుల కారణంగా రైతులు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల బలవన్మరణాల దాఖలాల్లేవని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.ఈ ఏడాది యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 92లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని చెప్పారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,300 కోట్లను ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఏడేండ్లలో ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం రూ.84,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా (7,83,574 లక్షల మెట్రిక్ టన్నులు) తొలిస్థానంలో నిలవగా సూర్యాపేట జిల్లా (6,49,192 లక్షల మెట్రిక్ టన్నులు) తృతీయ స్థానంలో నిలిచాయని అన్నారు. దేశానికి అందుతున్న ధాన్యంలో తెలంగాణ రాష్ట్రం వాటా 55శాతమని అన్నారు. దేశానికే బువ్వ పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో స్వరాష్ట్రంలో సాగుకు స్వర్ణయుగం కొనసాగుతున్నది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి బృహత్ కార్యక్రమంలో ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ ద్వారా మలేరియా, చికెన్ గున్యా,డెంగ్యూ లాంటి వ్యాధులు దరి చేరకుండా నివారించేందుకు వీలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, యాద్గార్ పల్లి గ్రామ సర్పంచ్ దుండిగల యాదమ్మ శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *