పట్టుపట్టాలె.. జట్టుకట్టాలె..గెలిచి చూపాలె

వాసాలమర్రి నుంచే దళిత బంధుకు అంకురార్పణ

★ 76 కుటుంబాలకు రూ.7 కోట్ల 60 లక్షలు మంజూరు

★ సభలోనే ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

★ దళిత వాడల్లో ప్రతి ఇల్లూ కలియ దిరిగిన సీఎం

★ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను చూసి
చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్

★ అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు
మంజూరు చేస్తామని హామీ

★ వృద్దులు , మహిళలు అందరినీ
ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి

★ సుమారు 3 గంటలు,4 కిలోమీటర్లు
కాలినడకన పర్యటన

★ ఎర్రవల్లిలాగే వాసాలమర్రి దశ దిశ మారుస్తాం

★ రూ. 10 లక్షలతో పైసకు పైసా సంపాదించాలె

★ రాష్ట్రంలోని దళితులు ఈ పథకంతో బాగుపడితే
నేనే గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పుకుంటాను

★ వాసాలమర్రి రాష్ట్రంలోని దళితులకు దారి చూపాలె

★ దళితుల పథకంపై దళితులదే పెత్తనం

★ గ్రామం, మండలం, రాష్ట్రస్థాయిలో కమిటీలు

★ వ్యాపారాలకు అండగా దళిత రక్షణ నిధి ఏర్పాటు

★ వాసాలమర్రి బంగారు వాసాలమర్రి కావాలె

★ వాసాలమర్రి గ్రామ దళిత బందు సభలో
ముఖ్యమంత్రి కేసీఆర్

యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తత గ్రామం వాసాలమర్రిలో తెలంగాణ దళితబందు పథకానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అంకురార్పణ చేశారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల అభవృద్ధి కోసం దళితబందు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. హుజూరాబాద్ దళితబందు పైలెట్ ప్రాజెక్ట్ ఇక లాంఛనమేనని సీఎం పేర్కొన్నారు.

గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున రూ. 7 కోట్ల 60 లక్షల రూపాయాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచే లబ్దిదారుల చేతికి సాయం అందుతుందన్నారు. దళితులంతా మార్వాడీల్లా వ్యాపారం చేసే స్థాయికి ఎదగాలన్నదే తన ఆరాటమన్నారు ముఖ్యమంత్రి.

దళిత బంధు పథకంలో దళితులదే పెత్తనమని చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వం సాయం అందించిన పది లక్షల్లో పది పైసలు కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు, బ్యాంకు లింకేజీ కూడా లేదన్నారు, వ్యాపారం చేసుకునేందుకు నిపుణులతో సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ కమిటీ వేస్తామని చెప్పారు. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి మండలం, జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మెక్రో చిప్ ఐడీ కార్డులు అందజేస్తామని చెప్పారు.

పథకం పక్కదారి పట్టకుండా తానే కావలి ఉంటానని సీఎం తెలిపారు, ఎమ్మెల్యేలు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారని చెప్పారు. రేపటి నుంచే వాసాలమర్రిలో దళిత బంధు అమలు అవుతుందని చెప్పారు. ఆరు నెలల్లోనే జీవితాలు మారేలా ఎవరికి వారు బిజినెస్ ప్లాన్ చేసుకోవాలని..ఇంటిల్లాది కూర్చుని ఏం వ్యాపారం చేస్తే బాగుంటుందో చర్చించుకోవాలన్నారు. పైస పైసా కూడబెట్టినప్పుడు ఫలితం ఉంటదన్న సీఎం కేసీఆర్… దళితులు బాగుపడితే తానే కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుంటానని చెప్పారు. అనుకోని సమస్యలు ఎదురైనా ఇబ్బంది తలెత్తకుండా రూ. 30కోట్లతో దళిత బంధు రక్షణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం సాయం అందించే పది లక్షల్లో నుంచి పది వేలు దళిత రక్షణ నిధికి బదిలి చేస్తామన్నారు. దళిత బంధు పొందినవారికి ఎక్కడా ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కొరత ఉండదన్నారు.

అంతకు ముందు కాలినడకన దళితవాడల్లో కలియ తిరిగిన సీఎం ఊరంతా ఆగమాగం ఉందన్నారు. అందుకే ఎర్రవెల్లిలా వాసాలమర్రి గ్రామాన్ని కొత్తగా పక్కా ప్లాన్ తో నిర్మిస్తామని చెప్పారు. సకల సౌకర్యాలు ఉండేలా లేవుట్ తో కొత్త గ్రామం నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు గ్రామస్తులు కలిసిమెలసి సహకరిస్తే సరిపోతుందన్నారు. ఆర్నెళ్లలో వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిని చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామంలోని సర్కార్ మిగులు భూములను కూడా దళితులకు పంచుతామని చెప్పారు సీఎం కేసీఆర్. దళితులంతా తగాదాలు, భూమి పంచాయితీలు వదిలిపెట్టి పట్టుపట్టి, జట్టుకట్టి దళిత బంధును విజయవంతం చేసి చూపాలని చెప్పారు.

దళితులంతా కష్టజీవులని చెప్పిన సీఎం..ఇన్నాళ్లు ఎలాంటి సాయం అందకనే వెనకబడి పోయారని చెప్పారు. ఎంతో నైపుణ్యం, బిజినెస్ ఐడియాలు ఉన్నా..పెట్టుబడి లేక వెనుకబడిపోయారని…ఇప్పుడు సర్కార్ వారికి ఇన్వెస్ట్ మెంట్ చేస్తుందని చెప్పారు. ఇక దళితులంతా చేయాల్సింది వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకుని బతుకులు మార్చుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలన్నారు.

వాసాలమర్రి రాష్ట్రంలో దళిత బంధుకు మోడల్ అని చెప్పిన సీఎం కేసీఆర్ ఈ స్కీమ్ ను విజయవంతం చేసే బాధ్యత కూడా ఇక్కడి గ్రామస్తులపై ఉందని చెప్పారు. అందివచ్చిన అవకాశాన్ని ఆలస్యం అయినా..ఆలోచించి అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్రంలోని దళితులందరికి దళిత బంధు అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్..దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు. 20 ఏండ్లుగా తెలంగాణ కోసం కొట్లాడి ఎలా సాధించామో అదే ఉద్యమ స్పూర్తితో అనతికాలంలోనే దళితుల జీవితాల్లో మార్పు కోసం కష్టపడుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.

దళితుల పేదరికానికి గత పాలకులే కారణమని చెప్పారు సీఎం కేసీఆర్. మహనీయుడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ తర్వాత అంతలా కృషి చేసిన నేతలెవరు లేరన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేస్తుంటే..కొందరు అవాకులు చెవాక్కులు పేలుతున్నారు అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మొదట్లోనే ఇలాంటి అవరోదాలు వచ్చాయని చెప్పిన సీఎం కేసీఆర్… ఆరు నూరైనా దళిత బంధును సక్సెస్ చేసి చూపుతామని చెప్పారు.

దళిత వాడల్లో ప్రతి ఇల్లూ కలియ దిరిగిన సీఎం
—————————————-

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రి లోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం సుమారు 3 గంటలపాటు పర్యటించారు. దళిత కుటుంబాల మహిళలు ముఖ్యమంత్రి కేసిఆర్ కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు.

దళిత వాడల్లోని సుమారు 60 ఇండ్లలోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలను కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బందు పథకం గురించి తెలుసా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారు..? దళిత బందు డబ్బలు వస్తే ఎం చేద్దాం అని అనుకున్నారు అని సీఎం ప్రశ్నించారు..? కొంత మంది మిల్క్ డైరీ ఫాం పెట్టుకుంటామని కొందరు ట్రాక్టర్ లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎం కు తెలిపారు. దళిత వాడల్లో పర్యటిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ … మీకు పెన్షన్ వస్తున్నదా.. అని ఆరా తీసారు. పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా వుంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ని ఆదేశించారు. దళిత వాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. కొన్ని ఇండ్లలో ఇంటిలోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బందు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సీఎం వారికి సూచించారు. దళిత కుటుంబాలతోపాటు ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని సీఎం వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా’’ అని సీఎం వాఖ్యానించారు.

ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎం కు విన్నవించగా అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడు అని చెప్పడంతో దళితబందు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి , ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా.. దళిత నాయకుడు ‘‘ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’’ అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరిని పెన్షన్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్ళు వస్తున్నాయా..? రైతు బందు డబ్బులు వస్తున్నయా ? ఏమేమ్ పంటలు సాగు చేస్తున్నారు అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధుల దగ్గర వెళ్ళీ పెన్షన్ లో కొంత ఏమైనా పక్కకు పోదుపు చేసుకుంటున్నరా అని అని ఆరా తీసారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగావున్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామి ఇచ్చారు.

సీఎం మద్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు గ్రామ కాలనీల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు కాలినడకన పర్యటించారు. ముఖ్యమంత్రి వెంట శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే గొంగిడి సునితా మహెందర్ రెడ్డి , ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్న, ఎమ్మెల్యే , సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ , కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సీఎం ఓస్డీ దేశపతి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ పి. నవీన్ కుమార్ కవులు , రచయితలు మిట్టపల్లి సురెందర్, సాయిచంద్ , అంబటి వెంకన్న అభినయ్ శ్రీనివాస్ , కోదారి శ్రీనివాస్, బూర సతీష్, మానుకోట ప్రసాద్, బాబు, శివ, బిక్షపతి, తదితరులు ఉన్నారు. దళిత వాడల్లో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి సర్పంచ్ ఆంజనేయులు ఇంటికి వెళ్లి భోజనం చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *