పనితీరును బట్టే … ప్రజా ప్రశంస

సమాజ సేవకులకు సంఘంలో సముచిత స్థానం
* ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం
హుజూరాబాద్ కు మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న చీమ వెంకన్నను ఘనంగా సన్మానించిన  తెలంగాణ రాష్ట్ర హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షులు           డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

సమాజ సేవకులకు సంఘంలో సముచిత స్థానం ఎల్లప్పుడూ ఉంటుందని మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమని,తప్పవని అన్నారు. ఏ ఉద్యోగి అయినా ఎక్కడ పనిచేసినా కన్నతల్లిని, పుట్టి పెరిగిన ఊరిపై మమకారాన్ని,ఆదరించి ప్రోత్సహించినవారిని ఎట్టిపరిస్థితుల్లో మరువద్దని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న చీమ వెంకన్న స్థానిక రాజీవ్ చౌక్ సమీపంలోని డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ క్లినిక్ ను సందర్శించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తన సిబ్బందితో కలిసి చీమ వెంకన్నను పుష్పగుచ్ఛం అందజేసి జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సన్మానించారు. మిర్యాలగూడ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పట్టణంలో అనేక అభివృద్ధి, పెండింగ్ పనులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, చైర్మన్ తిరునగర్ భార్గవ్ నేతృత్వంలో వేగవంతం చేసి నిబద్ధత గల అధికారిగా చీమ వెంకన్న విశేష గుర్తింపు తెచ్చుకున్నారని డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. కమిషనర్ చీమ వెంకన్న నిరూపమాన సేవలను పట్టణ ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని అన్నారు. కాగా, డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తన వైద్య వృతితో పాటు నిర్వర్తిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు కమిషనర్ చీమ వెంకన్న తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజసేవ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మదీహ, శ్రీనివాస్ రెడ్డి, ఫెరోజా, షాహెదా, గిరి, పాపయ్య, నవీన్, శివ, సాయి, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *