పాలేరు గులాబీలో చిచ్చు

పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పై సీపీకి ఫిర్యాదు

ఖమ్మం / అక్షిత బ్యూరో :

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో గులాభీ పార్టీలో విభేదాలు గుప్పుమంటున్నాయి.పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై అతని అనుచరులపై ఖమ్మం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు అందింది. అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరగణం ఈ ఫిర్యాదు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పాలేరు నియోజకవర్గ అధికార పార్టీ రాజకీయాల్లో ఫిర్యాదు సారాంశం పెను దుమారం రేపుతోంది. ఈమేరకు తుమ్మల నాగేశ్వరావు అనుచరులు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ను సోమవారం కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.సీపీని కలిసిన అనంతరం మీడియాతో తుమ్మల అనుచరులు మాట్లాడుతూ
పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అతని అనుచరులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన తమపై పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టిస్తూ తమను నిర్బంధాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.కూసుమంచి ఖమ్మం రూరల్ నేలకొండపల్లి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదైనట్లు కూడా వివరించారు.వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు కేసులను తుమ్మల అనుచరులైన రామసహాయం నరేష్ రెడ్డి జొన్నలగడ్డ రవికుమార్ బండి జగదీష్ తమ్మినేని కృష్ణయ్య ధరావత్ రామ్మూర్తి నాయక్ మద్ది మల్లారెడ్డి వెన్నెపూసల సీతారాములు తోట వీరభద్రం నెల్లూరి భద్రయ్య తేజావత్ పంతులు నాయక్ మాదాసు ఉపేందర్ రామసహాయం వెంకటరెడ్డి నెల్లూరి భద్రయ్య సహా దాదాపు 50 మంది నేతలు ఆయా అంశాలను తమ ఫిర్యాదులో ప్రస్తావించారు.ఎమ్మెల్యే ప్రోద్బలంతో పాలేరు నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూరల్ ఏసీపీ ఖమ్మం రూరల్ కూసుమంచి సీఐలు నాలుగు స్టేషన్లకు చెందిన ఎస్ఐలు సిబ్బంది తమను పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తుమ్మల అనుచరులు పేర్కొన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా టీఆర్ఎస్ పార్టీలో చేరినవారిపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అతని అనుచరుల ఆదేశం మేరకు తమను వివిధ గ్రాామాల్లోని పార్టీ శ్రేణులను పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.తన అనుచరులుగా తన వద్దకు రావాలని లేకుంటే కేసులు పెడతామని బెదిరిస్తూ గ్రామాల్లో వేధింపులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమపై పెట్టిన అక్రమ కేసులను కూడా పరిశీలించి గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నవారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో తుమ్మల అనుచరులు అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *