రాష్ట్రం చిన్నది… అభివృద్ధి పెద్దది

తెలంగాణ ప్రగతిపై నీతి అయోగ్ ప్రశంస

ఢిల్లీ, అక్షిత ప్రతినిధి : తెలంగాణపై నీతి ఆయోగ్‌ ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి అభినందనలతో ముంచెత్తింది. దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని నీతి ఆయోగ్‌ పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి జోరుగా సాగుతున్నదని తెలిపింది. దేశంలోని యువ రాష్ర్టాల్లో ఒకటని, విస్తీర్ణంలో చిన్నదైనా ఆర్థికంగా బలమైన రాష్ట్రమని కొనియాడింది. ఆర్థికవృద్ధిలో ఉమ్మడి రాష్ట్రం కన్నా ఎంతో మెరుగ్గా ఉన్నదని పేర్కొన్నది. ప్రధానమంత్రి నేతృత్వంలోని నీతి ఆయోగ్‌.. దేశం, అన్ని రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ ‘అర్థ్‌ నీతి’ ఏడో నివేదికను విడుదలచేసింది. ఇందులో తెలంగాణ ఆర్థికవృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించింది.

ఫలితమిచ్చిన సాగునీటి ప్రాజెక్టులు
తెలంగాణలో వ్యవసాయరంగం అనూహ్య వృద్ధిని నమోదు చేసిందని నీతిఆయోగ్‌ తెలిపింది. రాష్ట్ర జీఎస్డీపీలో ఈ రంగం వా టా 16 శాతంగా పేర్కొన్నది. గతంలో అత్యధికంగా వర్షాధార సా గు జరిగేదని, వర్షాల్లేకుంటే సాగు విస్తీర్ణం సగానికి పడిపోయేదని వెల్లడించింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని తెలిపింది. రైతుబం ధు, రైతుబీమా పథకాలతో అన్నదాతలకు అండగా నిలిచిందని కొ నియాడింది. ఫలితంగా రాష్ట్రంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయం ఎదిగిందని ప్రశంసించింది. అత్యాధునిక.. సంప్రదాయాల మేళవింపు తెలంగాణ పారిశ్రామిక రంగం అత్యాధునిక, సంప్రదాయాల మేళవింపుగా ఉన్నదని నివేదికలో పేర్కొన్నారు. ఫార్మా, బయోటెక్‌, నానో టెక్నాలజీ వంటి పరిశ్రమలతోపాటు టెక్స్‌టైల్‌, లెదర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి సంప్రదాయ పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం మూడోస్థానంలో ఉన్నదని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌-ఐపాస్‌ విధానంతో పారిశ్రామికరంగం కొత్తపుంతలు తొక్కిందని కొనియాడారు. ఫార్మారంగంలో తెలంగాణ దేశానికే లీడర్‌గా ఉన్నదని ప్రశంసించారు. 2019-20లో సుమారు రూ.33,771 కోట్ల (463 కోట్ల డాలర్ల) ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని తెలిపారు. దేశ ఫార్మా ఎగుమతుల్లో ఇది 20 శాతమని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలోనూ తెలంగాణ ముందువరుసలో ఉన్నదని కొనియాడారు. 2020 అక్టోబర్‌ నాటికి రాష్ట్రంలో 153 సెజ్‌లు ఉన్నాయని, ఇందులో 34 నడుస్తున్నాయని, 56 నోటిఫైడ్‌, 63 ప్రాథమిక అనుమతులు పొందినవి ఉన్నాయని వెల్లడించారు. విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించేందుకు పదేండ్ల ఈవీ పాలసీని ప్రవేశపెట్టారని, దీంతో సుమారు 1.20 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్నదని తెలిపారు.

మౌలిక సదుపాయాల్లో మేటి
రాష్ట్రంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, రోడ్డు, రైలు కనెక్టివిటీ చాలా బాగున్నదని ప్రశంసించింది. విద్యుత్తు రంగంలోనూ తెలంగాణ మంచి ప్రగతి సాధిస్తున్నదని వెల్లడించింది. రాష్ట్ర అభివృద్ధిపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు తాజా నీతి ఆయోగ్‌ అర్థ్‌నీతి నివేదిక చెంపపెట్టుగా మారింది. ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని స్వయంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని నీతి ఆయోగ్‌ స్పష్టంచేసింది.

చిన్న రాష్ట్రం.. పెద్ద ఆర్థిక వ్యవస్థ
విస్తీర్ణం, జనాభాపరంగా దేశంలో తెలంగాణ 12వ రాష్ట్రమని నీతి ఆయోగ్‌ పేర్కొన్నది. జీఎస్డీపీ పరంగా మాత్రం ఏడో అతిపెద్ద రాష్ట్రమని తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఏటా సగటున 9 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రంలోకన్నా ఇది ఎంతో మెరుగని ప్రశంసించింది.

ఐటీలో స్థిర అభివృద్ధి
రాష్ట్ర ఆర్థికవృద్ధిలో సేవారంగానిదే మెజారిటీ వాటా అని నివేదికలో పేర్కొన్నారు. ఇది జీఎస్డీపీలో దాదాపు 60 శాతంగా ఉన్నదని చెప్పారు. ముఖ్యంగా ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ టాప్‌ రాష్ర్టాల్లో ఒకటని చెప్పారు. ఐటీరంగంలో రాష్ట్రం కొన్నేండ్లుగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తున్నదని ప్రశంసించారు.

ఆదాయం పెరిగింది.. అప్పులు తగ్గుతాయి
గతేడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం 31 శాతం పెరుగొచ్చని అంచనా వేసింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ద్రవ్యలోటు లక్ష్యాలను తెలంగాణ అమలుచేస్తున్నదని, 2025-26 జీఎస్డీపీతో పోల్చితే రాష్ట్ర అప్పుల వాటా 0.5 శాతం తగ్గుతుందని తెలిపింది. కేంద్రం పన్నుల్లో రాష్ర్టానికి 0.86 శాతం వాటా ఉంటుందని చెప్పింది. ఈసారి కేంద్ర పన్నుల్లో వాటా రూ.13,900 కోట్లుగా ఉండొచ్చని, ఇది 2019-20తో పోల్చితే 6 శాతం తక్కువని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *