ఎన్బీఆర్ ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయం

ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనే ఔత్సాహిక యువతకు ఉచిత శిక్షణ అభినందనీయం

శిక్షణా తరగతులను ప్రారంభించిన మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : నల్లమోతు భాస్కర్ రావు( ఎన్బీఆర్) ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయమని మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కొనియాడారు. మిర్యాలగూడ పట్టణంలోని సమ్మిడి వీరారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎన్బీఆర్ ఫౌండేషన్, మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసులు సంయుక్తంగా అందిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత శిక్షణా తరగతులను డిఎస్పీ వెంటటేశ్వర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ లతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రోహిత్ సింగ్ మాట్లాడారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఎన్బీఆర్ ఫౌండేషన్ వరం లాంటిదని అన్నారు. ముఖ్యంగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అర్హత సాధించాలంటే తీవ్ర పోటీ నెలకొందన్నారు. వేలాది మంది విద్యార్థులు శిక్షణ కోసం హైదరాబాద్ నగరానికి, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లి వసతి కోసం, ఫీజుల రూపంలో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి లక్షలాది కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయాయని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నిరుద్యోగ, ఔత్సాహిక యువతకు ఎన్బీఆర్ ఫౌండేషన్ శిక్షణా తరగతులు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అభినందించారు. అనంతరం డిఎస్పీ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ భేష్ అని అన్నారు. పోలీసింగ్ అంటేనే సవాళ్ళతో కూడుకున్నదని, ఉన్నత ఆశయాలతో యువత పోలీస్ కొలువులను సాధించాలనే సంకల్పంతో ముందుకొస్తున్నారని అన్నారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని అభినందించారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలను సాధించాలనే యువతలో ప్రతిభావంతులను గుర్తించి ఉచిత శిక్షణ అందజేసి వారంతా జీవితంలో స్థిరపడే సదవకాశాన్ని కల్పిస్తున్నారని, ఆయన సేవలుఅనిర్వచనీయమని ప్రశంసించారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ సాయంతో ఉచిత శిక్షణ పొందినవారిలో అనేక మంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని అన్నారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే విద్యార్థులంతా తరగతులకు క్రమంతప్పకుండా హాజరై క్రమశిక్షణతో మెలగాలని, పట్టుదలతో చదువుకొని పోలీసు కొలువులు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాలి ధర్మపాల్ రెడ్డి, ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు చీదళ్ల వెంకటేశ్వర్లు, తిరుమలగిరి వజ్రం, షోయబ్, బాల శ్రీనివాస్ నాయుడు, నాగభూషణం, కేఎన్ఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ (రిటైర్డ్) ప్రభాకర్ రావు, శిక్షణా కేంద్రం అధ్యాపకులు సైదులు, శ్రీకాంత్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *