నమ్మించి నట్టేటా ?

సాధికారతపై చిత్తశుదేది !
కేసీఆర్ తోనే దళితుల నయవంచన
గడీల పాలనకు చరమగీతం
మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
దళితులను కేసీఆర్ నమ్మించి నట్టేటా ముంచాడు. ఆది నుంచి ఉత్తర ప్రగల్బాలే… కార్యరూపం దాల్చలేదు. ఇక దళితుల సాధికారతపై చిత్తశుద్ది లేదు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో దళితులకు ఒరిగిందేమి లేదు. అదిగో… ఇదిగో అంటూ నయవంచన చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. బుధవారం సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లోతెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యర్యంలో దళితుల అభ్యున్నతి’ అనే అంశంపై ఎంఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్టమాదిగతో మీట్ ది ప్రెస్ జరిగింది. ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ పలు అంశాలను ప్రస్తావించారు. దళిత కోణంలో సీఎం కేసీఆర్ మోసగాడని, సీఎం కేసీఆర్ కు దళితుల సాధికారత పట్ల చిత్తశుద్ధి లేదని ఏడేళ్ల పాలనలో తేలిపోయిందన్నారు. దళితుల సాధికారతను చంపింది సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ఉద్యమంలో అయనతో తొలి నాళ్ళ నుంచి సైద్ధాంతిక పోరాటం సాగించామన్నారు. జర్న లిస్టులు…దళితమేధావులు..ప్రతిపక్ష నేతలు, కేసీఆర్ గడీలో బందీలయ్యారన్నారు. మభ్య పెట్టడం, మోసం చేయడం అనేది కేసీఆర్ కు అలవాటని, దళితుల మద్దతు కోసం తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం దళితుడే అని 2002 నుండి 2013 వరకు మభ్యపెడుతూ వచ్చారన్నారు. సీఎం నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో దళిత నేతలు చచ్చిన పాముల్లా పడి ఉన్నారని, ప్రతిపక్ష నేతలు మౌనం, భజనకే పరిమితమయ్యారన్నారు. ఉమ్మడి ఏపీలో దళితులు మంత్రి వర్గంలో ఆరుగురు ఉండగా…అందులో తెలంగాణలోముగ్గురుండేవారన్నారు.తెలంగాణ వచ్చిన తరువాత జనాభా ప్రకారం నాలుగు పదవులు రావాలని, కానీ కేసీఆర్ కేవలం ఒక్కరికే అవకాశం ఇచ్చారని ధ్వజమెత్తారు. సమర్ధుడైన కడియం శ్రీహరిని కేబినెట్ లోకి ఎందుకు తీసుకోలేదని, తెలంగాణ రావడానికి కేసీఆర్ కాదు, 12 వందల మంది ఆత్మ బలిదానాలు..లక్షల మంది బహుజనుల పోరాటమే కారణమన్నారు. ధూంధాం కోట్ల మందిని చైతన్యం కలిగించిందని,అమరుల త్యాగాల్లో దళితుల భాగస్వామ్యం 28 శాతంగా ఉండగా, మరి ఒక్క వెలమ‌ పేరు చెప్పండని పేర్కొన్నారు. తెలంగాణను సీమాంధ్రులు అడ్డుకున్నప్పుడు అండగా నిలిచింది మేమే కదా? ఒక్క శాతం లేని వెలమలకు 8 శాతం మంత్రి పదవులా? ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ వంటి ఎందరో మేధావులు కేసీఆర్ చుట్టూ చేరిపోయారని,ఆరు వేల మందికి మూడెకరాల భూమిని పంచి.. లక్ష ఎకరాలకు పైగా దళితులనుంచి లాక్కున్నారన్నారు. వరంగల్ కలెక్టరేట్, పోలీసు కమీషనర్ కార్యాలయాల కోసం దళితుల భూమిని బలవంతంగా గుంజుకుని నిర్మించారని, ఆ భూముల విలువ ఎకరా రెండు కోట్లు పలుకుతుందని, అందుకే గుంజుకున్నారన్నారు. తెలంగాణ రాక ముందు ఏడు లక్షల మంది దళితులకు అసైన్డ్ భుములు ఉంటే ఆ సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోందే, తప్ప పెరగడం లేదన్నారు.ఫార్మా కంపెనీలకు, ప్రాజెక్టులకు, దేవాలయాల నిర్మాణానికి భూములు దొరుకుతాయి కానీ,
దళితుల కోసం భూములు దొరకడం లేదా?. పది లక్షలకు ఎకరం లెక్కన కొని ఇప్పించడం కేసీఆర్ కు ఇష్టం లేదని,
దళితులు, బహుజనులు కేసీఆర్ మోసాలను గ్రహించినప్పుడు, కేసీఆర్ భ్రమల నుండి బయట పడ్డప్పుడు ఖచ్చితంగా వెలమ దొరల గడీల పాలన అంతం అవుతుందన్నారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ప్రత్యామ్నాయం కానేకాదు. మా జాతుల కోసం పోరాటం సాగిస్తున్న మేము మాత్రమే ప్రత్యామ్నాయమని,కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు వామపక్షాలు ఈ విషయాలపై కేసీఆర్ ను నిలదీయలేదని, దొరల తెలంగాణను గద్దె దించి సామాజిక తెలంగాణ సాధిస్తామన్నారు. నిజా నిజాలను మీడియా దాయకుండా..మేం కేసీఆర్ చేసిన మోసాల గురించి చెప్పిన నిజాలను ప్రజల ముందుకు తీసుకెళ్లండని కోరారు. కేసీఆర్ కు సామాజిక తెలంగాణే నిజమైనప్రత్యామ్నాయమన్నారు. త్వరలో 119 నియోజకవర్గాల్లో పాదయాత్ర, సైకిల్ యాత్రలు నిర్వహించి కేసీఆర్ అవకాశవాదాన్ని ఎండగడతామని హెచ్చరించారు. కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని ఇచ్చిన హామిని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారని, మాజి ప్రధాని పీవి నరసింహారావు విగ్రహాన్ని మాత్రం పెట్టారన్నారు. పీవి ప్రధానిగా కొనసాగి ఉండవచ్చని,అట్లా చాలా మంది ప్రధానులుగా కొనసాగారన్నారు. కానీ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఒక్కరే కదా? హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఓడాలని మీరు కోరుకుంటున్నారు, కానీ మేము గెలవాలని కోరుకుంటున్నాం. దొరలను ఓడించి పటేళ్లను గెలిపించే విధానం మాది కాదని, హుజురాబాద్ లో దళితులు ఎక్కువగా ఉన్నందునే సీఎం కేసీఆర్ ఈ సమయంలో దళిత సాధికారతను తెరపైకి తీసుకు వచ్చారన్నారు. మరియమ్మ ఎన్‌కౌంటర్ విషయంలో ఇప్పటి వరకు పోలీసులపై లాకప్ డెత్, ఎస్సి, ఎస్టి అట్రాసిటి కేసు పెట్టలేదని, ప్రియాంక రెడ్డి, కల్నల్ సంతోష్ చనిపోయినప్పుడు లక్షలు, కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారని, మరియమ్మ కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి ఇచ్చారన్నారు. అట్రాసిటీ కేసు నమోదు అయి ఉంటే మరియమ్మ కుటుంబానికి కోటి రూపాయల విలువ చేసే భూములు వచ్చేవి కదా?.నన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మానవతావాది కూడా.. తెలంగాణ అడ్డుకోవడానికి రోడ్డు మీదకు రాలేదని, రాయలసీమ పట్ల అభిమానం ఉంటె ఉండొచ్చన్నారు. రాక్షసుడు అని విమర్శిస్తున్న వాళ్లు ఆనాడు ఆయన పాలనలో మంత్రులుగా ఎందుకు కొనసాగారని, రాక్షసుడి పక్షాన మీరెందుకు ఉన్నారన్నారు.

*పీసీసీ కమిటీలో లోపించిన సాధికారత*

ఏ ఐ సిసి ప్రకటించిన పిసిసి కమిటిలో కుడా దళిత సాధికారత లోపించిందని, కమిటీలో దళితులకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. టీఆర్ఎస్ వెలమ దొరల పార్టీ.. కాంగ్రెస్ రెడ్డీల పార్టీ గానే పరిగణిస్తామన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్ ఉపాధ్యక్షుడు జంగిటి వెంకటేష్, సంయుక్త కార్యదర్శి మధు, కోశాధికారి సురేష్ మిట్ ద ప్రెస్ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *