ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం

పరిసరాల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలి
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
 4వ రోజు పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్య కార్మికుల పనితీరును పరిశీలించి సూచనలు చేసిన భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. నాలుగో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం తెల్లవారుజామునే తన క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బయల్దేరారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన రోడ్లతో పాటు వీధుల్లో పారిశుధ్య నిర్వహణను స్వయంగా పర్యవేక్షించారు. మురుగునీటి కాల్వలను నిరంతరం పరిశుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని, చెత్త సేకరణలో ఎట్టిపరిస్థితుల్లో అశ్రద్ధ, అలసత్వం ప్రదర్శించొద్దని పారిశుధ్య కార్మికులను సూచించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను ఎమ్మెల్యే భాస్కర్ రావు స్వయంగా పర్యవేక్షించేందుకు వచ్చిన విషయం తెలుసుకొని మున్సిపల్ అధికారులు పరుగులు తీశారు. కాగా, పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పట్ల ఎమ్మెల్యే భాస్కర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికుల సేవలు కీలకమని భాస్కర్ రావు ఉద్ఘాటించారు. అందరి సహకారంతో మిర్యాలగూడ పట్టణాన్ని సుందరీకరించి పరిశుభ్రతకు చిరునామాగా మారుద్దామన్నారు. ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో మిర్యాలగూడ మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా పట్టణ ప్రజలను చైతన్యపర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణాల సమగ్ర వికాసమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని భాస్కర్ రావు అన్నారు. పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. కరోనా కష్టకంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో నాలాల పరిశుభ్రత, పొదలు,పిచ్చి మొక్కల తొలగింపు, విద్యుత్ దీపాల పర్యవేక్షణ, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయుట,పార్కు పరిశుభ్రత, అక్రమ నిర్మాణాల తొలగింపు తదితర పనులను మున్సిపల్ అధికారులు నిరంతర ప్రక్రియగా భావించి నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు,వార్డుల ఇంఛార్జీలు వార్డుల్లో కలియతిరుగుతూ వార్డు ప్రజల సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు. జిల్లా మంత్రికి రూ.2కోట్లు, కలెక్టర్ కు కోటి రూపాయలు, జిల్లా మంత్రి అంగీకారం మేరకు సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధి) నుంచి ఖర్చు చేసేందుకు ఎమ్మెల్సీ ,ఎమ్మెల్సీలకు ప్రభుత్వం అధికారాలు మంజూరు చేసిందన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా పట్టణ ప్రగతిలో భాగంగా అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేందుకు సీడీఎఫ్ నిధులు ఉపకరిస్తాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని భాస్కర్ రావు అన్నారు. రెండేండ్లలో రూ.766కోట్ల 12లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. పట్టణంలోని 48వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీలు నిర్మించామని అన్నారు. డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త,చెదారం సేకరణ కోసం కోటి 67 లక్షల రూపాయలతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. పట్టణంలో పే అండ్ యూజ్ విధానం ద్వారా రూ.72 లక్షల వ్యయంతో ఆరు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని అన్నారు. త్వరలో సమీకృత మార్కెట్ ను ప్రారంభించనున్నామని అన్నారు. అంతేగాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయించానని అన్నారు. అహ్లాదాన్ని పంచే మినీ ట్యాన్క్ బండ్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సరిపడకపోతే అదనంగా రూ.6కోట్లు కేటాయించినట్టు తెలిపారు. స్థానిక సుందరయ్య పార్కులో సుందరీకరణ పనులు చేపట్టామని చెప్పారు. ఈనెల10 వరకు కొనసాగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని భాస్కర్ రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *