“మిర్యాల” రూపు రేఖలు మార్చుతా

పారదర్శకతకు పెద్దపీట
* అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం
* పట్టణ ప్రగతిలో ముందంజలో మిర్యాలగూడ
* ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం
* హనుమాన్ పేటలో రూ.20 లక్షల నిధులతో సీసీ డ్రైనేజ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన
 మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్టు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. పట్టణ ప్రగతి పనుల్లో ముందుండటంతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేసినట్టు చెప్పారు. మిర్యాలగూడ పట్టణంలోని 22వ వార్డు- హనుమాన్ పేటలో రూ.20 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైనేజ్ నిర్మాణం పనులకు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆదివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. పట్టణాభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమం,  అభివృద్ధి విషయంలో అస్మదీయులు…తస్మదీయులనే భేదాలు తమకు లేవని భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కరోనా కష్టకంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో నాలాల పరిశుభ్రత, పొదలు,పిచ్చి మొక్కల తొలగింపు, విద్యుత్ దీపాల పర్యవేక్షణ, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయుట,పార్కు పరిశుభ్రత, అక్రమ నిర్మాణాల తొలగింపు తదితర పనులను మున్సిపల్ అధికారులు నిరంతర ప్రక్రియగా భావించి నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు,వార్డు ఇంఛార్జీలు తమ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. వానాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు. జిల్లా మంత్రికి రూ.2కోట్లు, కలెక్టర్ కు కోటి రూపాయలు, జిల్లా మంత్రి అంగీకారం మేరకు సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధి) నుంచి ఖర్చు చేసేందుకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం అధికారాలు మంజూరు చేసిందన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా పట్టణ ప్రగతిలో భాగంగా అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేందుకు సీడీఎఫ్ నిధులు ఉపకరిస్తాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని భాస్కర్ రావు అన్నారు. రెండేండ్లలో రూ.766కోట్ల 12లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త,చెదారం సేకరణ కోసం కోటి 67 లక్షల రూపాయలతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. పట్టణంలో పే అండ్ యూజ్ విధానం ద్వారా రూ.72 లక్షల వ్యయంతో ఆరు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించనున్నట్టు తెలిపారు. అంతేగాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయించానని అన్నారు. అహ్లాదాన్ని పంచే మినీ ట్యాన్క్ బండ్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సరిపడకపోతే అదనంగా రూ.6కోట్లు కేటాయించినట్టు తెలిపారు. స్థానిక సుందరయ్య పార్కులో సుందరీకరణ పనులు చేపట్టామని భాస్కర్ రావు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీ లో జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు చిలుకూరి రమాదేవి శ్యామ్, చీదళ్ల వెంకటేశ్వర్లు, సుబ్బారావు, కాంట్రాక్టర్లు, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *