మిర్యాలగూడ ప్రగతికి పరుగులు

మిర్యాలగూడ సమగ్రాభివృద్దే లక్ష్యం
రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే చర్యలు
* చిల్లాపురం నుంచి రాఘవాపురం తండా వరకు బీటీ రోడ్డు పనులకు శంఖుస్థాపన
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్దే తమ లక్ష్యమని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. మిర్యాలగూడ మండలంలో భగ్యగోప సముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని చిల్లాపురం గ్రామం నుంచి రాఘవాపురం తండా వరకు కిలోమీటర్ మేర నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణం పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, నాణ్యత లోపిస్తే ఉపేక్షించబోమని గుత్తేదారులను, అధికారులను ఎమ్మెల్యే భాస్కర్ రావు హెచ్చరించారు. కాగా, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన మూడో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 1.25లక్షల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలను 2025లోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ మేరకు బడ్జెట్లో రూ.80,250కోట్లను కేటాయించింది. ఈ స్కీం లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం నిష్పత్తి 60:40. పీఎంజీఎస్వై ద్వారా మారుమూల కుగ్రామాల నుంచి సమీప వ్యవసాయ మార్కెట్లను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలను చేపడుతోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు అవసరమైన చోట్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ శంకర్ నాయక్, ఉపసర్పంచ్ అజ్మీర బాబు, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *