మాదిగల ఆర్థికాభివృద్ధికి మిక్కీ తోడు

మిక్కీతో మాదిగల పురోభివృద్ది
మాదిగలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
మిక్కీ గౌరవ అధ్యక్షులుగా గువ్వల

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను మాదిగలు సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని, తద్వారా పారిశ్రామిక వేత్తలుగా తయారు కావాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) ఆధ్వర్యంలో లక్డీకపూల్ లో దళిత బంధు పథకం సద్వినియోగం, వ్యాపార పెట్టుబడులపై అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. సభకు ముఖ్య అతిధిగా హాజరైన గువ్వల బాలరాజు మాట్లాడుతూ..దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు పేరుతో దేశంలో మరెక్కడా లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఒక్కో ఇంటికి రూ.10 లక్షలు మంజూరు చేయడమే కాకుండా ఈ నిధులను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మిక్కీ సంస్థ ద్వారా మాదిగలు ఆర్ధిక పురోభివృద్ధి సాధించేందుకు ప్రతినిత్యం మాదిగ సమాజానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందుకు ప్రభుత్వం నుంచి కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. దళితబందు పథకం ద్వారా ప్రభుత్వం అందజేసే రూ.10 లక్షలతో ఎలాంటి వ్యాపారాలు నిర్వహించుకోవాలో ప్రభుత్వంతో పాటు మిక్కీ లాంటి సంస్థలు సలహాలు, సూచనలు అందజేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బలరాజును మిక్కీ గౌరవ ఛైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, మిక్కీ అధ్యక్షుడు సుంచు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి.నర్సింగ్ రావు, ఉపాధ్యక్షుడు బక్కా నరసింహ, వై ఆనందం, సుధాకర్, శివ, భాస్కర్, ప్రశాంత్, సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కొత్తగా వ్యాపార, వణిజ్య రంగాల్లోకి అడుగిడే మాదిగలకు మిక్కీ సలహాలు, సూచనలివ్వడంతో పాటు ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న వాళ్లకు తగిన మెళుకువలు, పురోభివృద్ధి సాధించేందుకు మిక్కీ తోడుంటుంది. చిన్న చిన్న వ్యాపారాల నుంచి మొదలుకొని… ఎంతటి పెద్ద పరిశ్రమ నెలకొల్పినప్పటికి మిక్కీ టెక్నికల్ చేయూతనిస్తుంది. మాదిగలు పారిశ్రామిక రంగంలోకి అడుగిడి ఉజ్వలమైన… ఉన్నతమైన స్థానాలకు చేరేందుకు మిక్కీ సమగ్రమైన సలహాలు అందిస్తూ వెన్నంటి ఉంటుందని… మిక్కీ ఏలాంటి లాభాపేక్ష లేకుండా సేవలందించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *