ఆత్మీయ వీడ్కోలు కోసం – ఉచిత సేవల వైకుంఠ రథాన్ని ప్రారంభించిన గుత్తా, భాస్కర్ రావు

  • ఆత్మీయ వీడ్కోలు కోసం
  •  ‘వైకుంఠ రథం’ 
  • ‘గిఫ్ట్ ఎ స్మైల్’
  • మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాసేవలో ‘సిద్దార్ధ ‘
  • ఉచిత సేవల వైకుంఠ రథాన్ని ప్రారంభించిన గుత్తా, భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: సమాజసేవలో నల్లమోతు భాస్కర్ రావు (ఎన్బీఆర్) ఫౌండేషన్ మరో అడుగు ముందుకేసింది. కరోనా లాంటి కష్టకాలంలో మృతులను శ్మశానవాటికకు తరలించేందుకు వాహనదారులు ముందుకు రాకపోవడం, ఒకవేళ వచ్చినా బాధిత కుటుంబం నుంచి అధికమొత్తంలో ముక్కుపిండి వసూలు చేసేవారు. క్లిష్టకాలంలో అభాగ్యుల దయనీయస్థితిని కళ్లారా చూసిన ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ చలించిపోయారు. తనవంతుగా ఏదైనా సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి28న స్మశానవాటికల్లోని మౌళికవసతులు, దహనసంస్కారాల నిర్వహణ తదితర అంశాలను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్వయంగా పరిశీలించారు. శ్మశానవాటికల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. గౌరవప్రదంగా నిర్వహించాల్సిన ఆఖరి మజిలీ కోసం అష్టకష్టాలు పడుతున్న నియోజకవర్గ ప్రజల్లో నిరుపేదలకు సాయం అందించాలని నల్లమోతు సిద్దార్ధ నిర్ణయించుకున్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత సేవల వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసి శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. 

ఎన్బీఆర్ ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయమని తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కితాబిచ్చారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసం ఆత్మీయ వీడ్కోలు గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతో మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా వైకుంఠ రథాన్ని సిద్దార్ధ ఏర్పాటు చేశారు. పట్టణంలోని తాళ్లగడ్డ క్రాస్ రోడ్ లో వైకుంఠ రథం సేవలను గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్ధను, సభ్యులను అభినందించారు. మరెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో సాంఘీక సమానత్వం కోసం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న వైకుంఠ ధామాల కారణంగా కాష్టాల గడ్డల్లో కష్టాలు వైదొలగాయని అన్నారు. వైకుంఠ ధామాల ద్వారా సబ్బండ వర్ణాలకు కూడా ఒకే శ్మశానంలో అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు వీలవుతున్నదని అన్నారు. వైకుంఠ ధామాల నిర్మాణాల ద్వారా సామాజిక విప్లవానికి తెర లేపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో వైకుంఠ ధామం నిర్మాణానికి రూ.12.60 లక్షల చొప్పున ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,644 వైకుంఠ ధామాలు పూర్తి అయ్యాయని అన్నారు. ప్రతీ వైకుంఠ ధామంలో ప్రహరీ గోడలు, పార్కింగ్, స్నానాల గదులు, వెయిటింగ్ హాల్స్, ఆస్తికలు నిలువ చేసుకునేందుకు బాక్సులు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రభుత్వ నిధులే గాకుండా గ్రామస్థులు స్వచ్చందంగా సాయం అందించేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. కొన్ని గ్రామాల్లో ఫ్రీజర్లను, శవాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల సౌకర్యం కోసం వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తెచ్చిన నల్లమోతు సిద్దార్ధను మరోసారి అభినందిస్తున్నట్టు తెలిపారు. వైకుంఠ రథం ఉచిత సేవల కోసం ఎన్బీఆర్ ఫౌండేషన్ 9162363636 సెల్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, టీఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జునా చారీ, జొన్నలగడ్డ రంగా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *