కేటీఆర్ తనయుడు హిమాన్షుకి డయానా అవార్డు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి ; టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు కుమారుడు హిమాన్షు రావుకి డయానా అవార్డు దక్కింది. తొమ్మిది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు ఈ సారి హిమన్షు రావు కి దక్కింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేసే పనులకి ఈ అవార్డు ఇస్తారు. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరు మీద ఈ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటన్ కేంద్రంగా ఈ అవార్డును ప్రధానం చేసే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా యువకులు చేసే సోషల్ వర్క్ ని ఈ అవార్డు కోసం పరిగణలోకి తీసుకుంటుంది. హిమాన్షు గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా చేపట్టాల్సిన పలు అంశాలను పరిగణలోకి తీసుకుని స్వయంగా శోమ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాల్లో ఈ మేరకు ఆయన పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం తనకు సంపూర్ణ మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హిమాన్షు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు తనకున్న ఆలోచనల మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకి సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు మరియు తన మెంటార్స్ కి ఈ సందర్భంగా హిమాన్షు రావు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు వచ్చిన సందర్భంగా హిమన్షుకు, ఆయన మిత్రులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే మానవీయ దృక్పథంతో గ్రామాల్లో మార్పుకు చేపట్టిన కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం గొప్ప విషయమని పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *