కృష్ణమ్మ పరవళ్లు

ప్రాజెక్టులకు భారీగా వరద

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

గేట్లు ఎత్తివేత.. విద్యుదుత్పాదన

జూరాల, సాగర్‌కు భారీ ఇన్‌ఫ్లో!

41 గేట్లు ద్వారా జూరాల నీటి విడుదల

సాగర్‌ నీటిమట్టం 541.60 అడుగులు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ :ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రాజెక్టులకు నీటి ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఇన్‌ఫ్లో వస్తుండడంతో నిండుకుండను తలపిస్తోంది. దీంతో బుధవారం రాత్రి డ్యామ్‌ 2 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి దిగువకు 53,488 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి మట్టం గరిష్ఠ స్థాయిని చేరుకోవడానికి మరో 3 అడుగులు మాత్రమే ఉన్నందున మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జలాశయంలోకి 4.65 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.41 అడుగులకు చేరింది. 2007 తర్వాత జూలైలో ప్రాజెక్టు పూర్తిగా నిండటం, గేట్లు ఎత్తడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. జూరాల, సాగర్‌లకు భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాల ప్రాజెక్టుకు 3.72,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుతం 316.810 మీటర్లలో 6.416 టీఎంసీల నీరు ఉంది. 41 గేట్ల ద్వారా 3,82,899 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌ ప్రాజెక్టుకు 66,375 క్యూసెక్కుల నీరు వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 541.60అడుగులు(197.6778టీఎంసీలు)గా ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టుకు 5,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 5000క్యూసెక్యుల నీటిని వినియోగిస్తూ రెండు యూనిట్ల ద్వారా 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77టీఎంసీలు). కాగా, ప్రస్తుతం 173.52 అడుగులకు (43.49టీఎంసీలు) చేరింది. కృష్ణా ఎగువ భాగంలోని ఆల్మట్టి జలాశయానికి 4.13 లక్షల క్యూసెక్కులు,  నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు 4 లక్షల క్యూసెక్కుల వరద  వస్తోంది,  ఇక తుంగభద్ర రిజర్వాయర్‌కు 82,150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం 8370 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (90 టీఎంసీలకు) ప్రస్తుతం 1090.3 (86.461 టీఎంసీల) అడుగుల మేర నీటి నిల్వ ఉంది. విద్యుదుత్పత్తి కోసం 8వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గడంతో 14 రోజులుగా ఎత్తి ఉంచిన గేట్లను మూసివేశారు. 645 అడుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం 638.80అడుగులు (2.95టీఎంసీలు) ఉంది. 

మేడిగడ్డ 46 గేట్ల ఎత్తివేత 

అన్నారం బ్యారేజీ గేట్లను పూర్తిగా మూసివేశారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. అన్నారం బ్యారేజీలోకి బుధవారం మానేరు, గోదావరి ప్రవాహం ద్వారా 29,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా బ్యారేజీ నీటి నిల్వ 1.70 టీఎంసీలకు చేరింది. మేడిగడ్డలోకి 1.43 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో  చేరుతుండగా 46 గేట్లను ఎత్తి 1.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో 1.09 టీఎంసీల నీరు ఉండగా నీటిమట్టం 3.30 మీటర్లు నమోదైంది.

భారీ వర్షాలకు వందలాది ఎకరాల్లో పంట నష్టం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెదక్‌ జిల్లాలో 149 ఎకరాలు,  సిద్దిపేట జిల్లాలో 140 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. వికారాబాద్‌ జిల్లాలో 132 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు, 150 కిలోమీటర్ల వరకు పంచాయతీరాజ్‌ రోడ్లు ధ్వంసమయ్యాయి. 124 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. తాండూరు, బొంరా్‌సపేట్‌ మండలాల్లో పెసర పంటకు నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో 30 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి.రాష్ట్రంలో రాగల రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె. నాగరత్న తెలిపారు. మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల మీదుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి, మధ్యస్థ ట్రోపోస్పియర్‌ వరకు స్థిరంగా కొనసాగుతున్నట్లు డైరెక్టర్‌ తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *