కౌశిక్‌ టీఆర్ఎస్ లో చేరిక వాయిదా !

కరీంనగర్‌, అక్షిత ప్రతినిధి :ఒక్కరోజులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో గులాబీదళం మౌనం దాల్చింది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌లో కారుదే జోరు అని తిరిగిన టీఆర్‌ఎస్‌ నేతల కాళ్లకు బ్రేక్‌ పడింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటలపై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌ రెడ్డి ‘టీఆర్‌ఎస్‌ టికెట్టు నాకే కన్ఫర్మ్‌ అయింది’ అని మాట్లాడిన కాల్‌ రికా ర్డులు వైరల్‌ కావడమే ఇందుకు కారణం. రెండు నెలలుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే విషయంలో గోప్యత పాటిస్తూ వచ్చిన ఆ పార్టీ నాయకులు కౌశిక్‌రెడ్డి కమలాపూర్‌ మండలం మాదన్నపేట యువకుడు విజేందర్‌కు స్వయంగా ఫోన్‌చేసి చెప్పుకున్న ఆడియో లీక్‌ కావడంతో కంగుతిన్నారు.

కౌశిక్‌ మాటల్లో మాదన్నపేట గ్రామ సర్పంచ్, కాంగ్రెస్‌ నాయకుడు చరణ్‌ దగ్గరున్న యూత్‌ ను లాగాలని, అందుకోసం రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వాలని చెప్పడం తెలిసిందే. రిఫరెన్స్‌గా చెప్పిన మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి కూడా అదే యువకుడికి ఫోన్‌ చేసి ‘చరణ్‌ పటేల్‌ దగ్గరున్న ఒక్కొక్కరికి రూ.5వేలు, మందు, ఖర్చులకు పైసలు ఇస్తాం. అందరినీ గుంజుకు రావాలె..’ అనడం వివాదాస్పదమైంది. డబ్బులతో కాంగ్రెస్‌ కార్యకర్తలను కొనుగోలు చేసుకుని కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే ప్రచారం సోషల్‌మీడియా వేదికగా సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *