తట్టా బుట్టా సర్దుకో… కేసీఆర్

ప్రగతి భవన్‌ను అంబేడ్కర్‌ భవన్‌గా మారుస్తాం
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం అదే

దొంగల చేతిలో బందీగా తెలంగాణ

మల్లారెడ్డి ఓ జోకర్

నిమ్మరసమిచ్చి… దీక్ష విరమింప చేసి
దళిత, గిరిజన దీక్షలో రేవంత్‌రెడ్డి

మేడ్చల్‌, అక్షిత ప్రతినిధి : కేసీఆర్‌.. నీ టైమ్‌ అయిపోయింది. తట్టాబుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చిందిఅని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు కోతుల గుంపులా దోచుకుంటున్నారని విమర్శించారు. గజదొంగల చేతిలో బందీగా ఉన్న తెలంగాణను విడిపిస్తామని స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో రేవంత్‌ చేపట్టిన 48గంటల దీక్షను దామోదర రాజనర్సింహతోపాటు ఇతర నాయకులు బుధవారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పడిన కష్టం కంటే అధికంగానే ప్రజలు ఆయనకు ఇచ్చారని పేర్కొన్నారు. ఇంకా ఇవ్వడానికి తెలంగాణ సమాజం వద్ద ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్‌కు టైమ్‌ అయిపోయిందని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సమయం వచ్చిందని అన్నారు. కేసీఆర్‌ ముందు పుట్టారా? మోసం ముందు పుట్టిందా? అంటే చెప్పడం కష్టమేనని వ్యాఖ్యానించారు.

ఒకవైపు కేసీఆర్‌ కుటుంబం.. మరోవైపు మంత్రి మల్లారెడ్డి కుటుంబం కలిసి బంగారు తెలంగాణను కంగారు తెలంగాణగా మార్చారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి, మహేశ్వరం, మూడుచింతలపల్లిలో కాంగ్రెస్‌ ఆందోళనలను జపాన్‌ ఎలుక మాదిరిగా కేసీఆర్‌ ముందే పసిగట్టారు. అందుకే ఫాంహౌస్‌ వదిలి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆ ఎలుకను బోనులో బంధించాల్సిన అవసరం ఉంది. త్వరలో గజ్వేల్‌లో మీటింగ్‌ పెట్టి అధికార పార్టీని నిలదీస్తా అని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ బహుజన భవన్‌గా మారుస్తానని రేవంత్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అఽధికారంలోకి రాగానే ఎవరు సీఎం అయినా తొలి సంతకం దీనిపైనే పెడతామని తెలిపారు. దళిత, గిరిజన, బహుజన బిడ్డల కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామన్నారు. హుజురాబాద్‌లో అయ్య గెలుస్తామంటున్నాడు… కొడుకు మాత్రం గెలిస్తే ఎంత? ఓడితే ఎంత? అంటున్నాడు… అయ్య చెప్పిందంతా అబద్ధమేనని చెబుతున్నాడు.. అంటే విషయం వాళ్లకు అర్ధమైనట్టుంది అని వ్యాఖ్యానించారు. కాగా, మూడుచింతలపల్లి ఇందిరమ్మ కాలనీలో బుధవారం ఉదయం రేవంత్‌రెడ్డి పర్యటించారు. కాలనీ అంతా కలియ తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై మేడ్చల్‌ కలెక్టర్‌ హరీశ్‌తో ఫోన్‌లో మాట్లాడిన రేవంత్‌.. ఇందిరమ్మ కాలనీలో ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్‌ను కోరారు. కాంగ్రెస్‌ పార్టీలో చాలా సంవత్సరాల తర్వాత ఒక ఉత్సాహం, ధైర్యం, అధికారాన్ని సాధిస్తామనే ఆశ.. రేవంత్‌ రాకతో మొదలైందని దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అందరూ కదనరంగంలో ముందుకు వెళ్తేనే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితుల కోసం చేపట్టిన సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి మళ్లించిందని ఆరోపించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని, అందరికి ఆశ పెడుతూ మోసం చేస్తూ వచ్చారని ఆరోపించారు. కార్యక్రమంలో అద్దంకి దయాకర్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క, డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *