డబ్బుల కోసమే కొందరు మహిళలు తమపై లైంగికదాడి జరిగిందన్న ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ఉదిత్రాజ్ చేసిన వ్యాఖ్యలు పెద్దఎత్తున దుమారం రేపుతున్నాయి. మీటూ (నేను కూడా బాధితురాలినే) ఉద్యమంలో భాగంగా.. బాలీవుడ్ తారలనుంచి మహిళా పాత్రికేయుల వరకు తమకు ఎదురైన లైంగిక వేధింపులను ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వెల్లడిస్తున్నారు. మనదేశంలో బాలీవుడ్ నటుడు నానాపటేకర్ తనను లైంగికంగావేధించారంటూ నటి తనుశ్రీదత్తా చేసిన ఆరోపణల నుంచి ఈ మీటూ ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నది. అయితే ఈ మీటూ ఉద్యమంపై వాయవ్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గ ఎంపీ ఉదిత్రాజ్ నోరుపారేసుకున్నారు. భారత్లో మీటూ ఉద్యమం తప్పుడు సాధనంగా మారిందని పేర్కొన్న ఆయన.. డబ్బుల కోసమే మహిళలు ఈ తరహా ఆరోపణలు చేస్తారంటూ నోటికొచ్చినంతా వాగేశారు.
అవును లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయనే విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను. ఇది మగవాడి స్వభావం. మరి మహిళలు సరిగ్గానే ఉన్నారా? ఈ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా? కొందరు దీన్ని అడ్డంపెట్టుకుని ఒక్కొక్కరి దగ్గర రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు గుంజుతారు. అలా డబ్బు చేతికి రాగానే.. మరో మగవాడి మీద పడుతున్నారు. ఈ ఉద్యమం పురుషుల జీవితాన్ని నాశనం చేస్తున్నది అని ఆయన వ్యాఖ్యానించారు. మీటూ ఉద్యమం సృష్టించిన భయానక వాతావరణం కారణంగా మహిళలను ఒంటరిగా కలవడానికి పురుషులు భయపడుతున్నారని చెప్పారు. పదేండ్ల క్రితం వేధింపులు జరిగితే, ఇప్పుడెందుకు వాటిని బయటకు తెస్తున్నారని ఉదిత్ ప్రశ్నించారు.
Tags: Journalists,Sexual,Women,MJ Akbar,Mukesh