జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ ముఖ్యం

జర్నలిస్టులకు ‘హెల్త్ క్యాంపులు’ అభినందనీయం

ఇస్మాయిల్ వైద్య సేవలు భేష్

మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : జర్నలిస్టులు విధి నిర్వహణకు తోడు ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్టు, టెంజూ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ జన్మదినం సందర్భంగా జర్నలిస్టుల కోసం నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంపుకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జర్నలిస్టుల కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జర్నలిస్టులందరూ ఆరోగ్య సంరక్షణపై దృష్టిపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యం పని ఒత్తిడి, చాలీచాలని జీతాలు, యాజమాన్య వేధింపులు, ఉద్యోగ భద్రత ఇలాంటి సమస్యల మధ్య పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఇలాంటి హెల్త్ క్యాంపులతో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని ఆయన అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన జర్నలిస్టు సోదరులకు మీడియా అకాడమీ ఆర్ధిక సహాయం చేసిందన్నారు. కరోనా బారిన పడ్డ జర్నలిస్టులకు ఇప్పటి వరకు 5 కోట్ల 36లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేశామని అల్లం నారాయణ అన్నారు. టెంజూ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జర్నలిస్టు మిత్రుల కోసం హెల్త్‌ క్యాంపులను నిర్వహించనున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రతి జర్నలిస్టులను ఆదుకునేందుకు ముందుకు వస్తానని ఇస్మాయిల్ అన్నారు. అనంతరం తెలంగాణలో నిర్వహించనున్న హెల్త్ క్యాంపుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. క్రియా ఫౌండేషన్, కోవిదా ఫౌండేషన్, టీలైన్ 24 న్యూస్ చానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంపులో బీపీ, షుగర్, బీఎంఐ, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. సీనియర్ వైద్యుల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కన్సల్టేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకుడు, టీడబ్యూజేయూ జనరల్ సెక్రెటరీ ఆస్కానీ మారుతీ సాగర్, టెంజూ సెక్రెటరీ రమణ కుమార్, కోవిదా సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ జీ. అనూహ్యారెడ్డి, టీలైన్ 24 చైర్మెన్ జీ. కృష్ణవేణి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్‌ఎన్ కపర్తి, క్రియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *