2న హాలియాకు సీఎం కేసీఆర్‌

* ఇచ్చిన హామీల అమలుపై సమీక్ష
* ఫిబ్రవరిలో 13 లిఫ్ట్‌లకు శంకుస్థాపన
* ఏడాదిన్నరకాలంలోనే పూర్తిచేస్తానని ప్రకటన
* కృష్ణాకు గోదావరి నీళ్ల ప్రతిపాదనపై చర్చ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమలుచేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షించాలని నిర్ణయించారు. ఇందుకోసం వచ్చేనెల 2న నల్లగొండ జిల్లా హాలియాలో పర్యటించనున్నారు. కృష్ణపట్టెతోపాటు, సాగర్‌ ఎడమకాలువ చివరి భూములకు సాగునీరందించేందుకు రూ.2,500 కోట్లతో 13 లిఫ్ట్‌లకు ఫిబ్రవరి 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరలో వీటినిర్మాణం పూర్తిచేస్తానని హామీఇచ్చారు. లిఫ్ట్‌ నిర్మాణ పనులతోపాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అమలును స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించాలని నిర్ణయించిన సీఎం వచ్చేనెల 2న హాలియా పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇచ్చిన హామీమేరకు నిర్ణీతవ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఆదేశాలు జారీచేస్తారు. ఇప్పటికే నిర్మాణంలోఉన్న డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, ఎస్సెల్బీసీ టన్నెల్‌, ఉదయసముద్రం- బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్‌ పనులపై కూడా సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు. కృష్ణా బేసిన్‌కు నీళ్లందని సమయంలో సీతారామప్రాజెక్టు నుంచి పాలేరు రిజర్వార్‌ ద్వారా దేవులపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు గోదావరి నీటిని లిఫ్ట్‌చేసేందుకు ఇప్పటికే రూ.600 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేయించారు. దీనిపై కూడా సీఎం సమీక్షించనున్నారు. నాగులపల్లి మండలంలోని నీళ్లపాలెం, టోకుచెర్ల లిఫ్ట్‌లపై కూడా చర్చిస్తారని తెలిసింది.

ఎన్నికల హామీల అమలు కోసమే

మంత్రి జగదీశ్‌రెడ్డి

సాగర్‌ నియోజకవర్గంలో మిగిలిఉన్న అభివృద్ధి అంశాలను నెరవేరుస్తామని ఉప ఎన్నిక సమయంలో హామీఇచ్చిన సీఎం కేసీఆర్‌.. ఆ మేరకు చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మునుగోడులో ఆయన మాట్లాడుతూ.. మిగిలిఉన్న అభివృద్ధి అంశాలపై ప్రణాళికలు సిద్ధంచేసే విధంగా ఈ సమీక్ష ఉంటుందని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చడమే లక్ష్యంగా కేసీఆర్‌ పర్యటన కొనసాగనున్నదని వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్‌ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఎమ్మెల్యే నోముల భగత్‌ హాలియాలో బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *