సంస్థాగతానికి గులాబీ పటిష్ట పునాది

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి అధినేత కేసీఆర్‌ దృష్టి
అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌
వచ్చే నెల రెండు నుంచి కార్యాచరణ
జెండా పండుగతో శ్రీకారంవార్డు స్థాయి నుంచి
జిల్లా వరకు ఏర్పాటు తొలిసారి
జిల్లా కార్యవర్గాల ఎన్నికకు నిర్ణయం
కమిటీల్లో సామాజిక సమతూకానికి పెద్దపీట
నేటి నుంచి సన్నాహక సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
పటిష్టవంతమైన నిర్మాణంపై దృష్టి సారించింది. సంస్థాగతంగా ఉన్న బలాన్ని కమిటీల రూపంలో ఆవిష్కరించేందుకు అడుగులు వేస్తున్నది. వార్డు స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడితో కూడిన కార్యవర్గం ఎన్నిక కోసం నిర్ధిష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. వచ్చే నెల 2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు పునాదిరాయి శుభ సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అదే రోజు అన్ని గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. దీంతోనే సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పటిష్టమైన కమిటీలు ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది.

ఈ కమిటీల్లోనూ సామాజికంగా

సమతూకం పాటించాలని, 51శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు స్థానం దక్కేలా కూర్పు ఉండాలనిదిశానిర్దేశం చేసింది.ఇక నేటి నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001లో కేసీఆర్‌ సారథ్యంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అనతికాలంలోనే ఉద్యమ లక్ష్యాన్ని సాధించి సుస్థిర రాజకీయ పార్టీగా పురుడు పోసుకుంది. పార్టీని స్థాపించిన 13 ఏండ్లలోనే రాష్ర్టాన్ని సాధించి, ఆపై అధికారంలోకి వచ్చి ఏడేండ్లలోనే అభివృద్ధ్దిలో దేశానికే ఆదర్శంగా నిలుపుతూ తిరుగులేని రాజకీయశక్తిగా ఆవిర్భవించింది. కేసీఆర్‌ నాయకత్వంలో రెండు దశాబ్దాల్లో రాష్ట్రంలోని ప్రతి మూలకూ పార్టీ విస్తరించింది. లక్షలాది మంది కార్యకర్తలతో రాష్ట్రంలో ఏ పార్టీకి అందనంత ఎత్తులో టీఆర్‌ఎస్‌ సగర్వంగా నిలబడింది. ఈ క్రమంలో పార్టీ కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలకొర్చిన క్యాడర్‌కు సైతం తనదైన శైలిలో గుర్తింపునిచ్చి ముందుకు సాగుతుంది. ఇటీవలే పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. సాధారణ సభ్యులతో పాటు క్రియాశీలక సభ్యులకు వేరుగా సభ్యత్వం కల్పించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల వరకు పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉంది. సూర్యాపేట, ఆలేరు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఈ ఏడాది 60 వేల వరకు సభ్యతత్వం చేరుకుంది. సుమారు ఆరు లక్షలమందికి పైగా సభ్యులతో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా మరోసారి తన సత్తా చాటింది. పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఉ న్న ప్రతీ ఒక్క సభ్యుడి వివరాలను ఆన్‌లైన్‌ చేస్తూ వారికి బీమా సౌకర్యం కూడా కల్పి ంచి పార్టీ శ్రేణుల కుటుంబాలకు భరోసా నిస్తుంది. దీంతో పార్టీపైనా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆదరణ లభిస్తున్నది. అందుకే జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌కు ఎదురులేని విజయాలు సొంతం అవుతున్నాయి. గతంలో హుజూర్‌నగర్‌, ఇటీవల నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో టీఆర్‌ఎస్‌ విజ యం సాధించింది.

బలమైన శక్తిగా టీఆర్‌ఎస్‌

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, అన్ని స్థానాల్లో ఎమ్మెల్సీలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు, డీసీసీబీత, డీసీఎంఎస్‌ చైర్మన్‌, మెజార్టీ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, కోఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఇలా అన్ని స్థాయిల్లో బలమైన శక్తిగా టీఆర్‌ఎస్‌ కొనసాగుతుంది.

వచ్చే నెల 2 నుంచి కమిటీలు షురూ..

వచ్చే నెల 2 నుంచి సంస్థాగత నిర్మాణం మొదలు కానుంది. 20 వరకు నిర్దిష్ట షెడ్యూ ల్‌ ప్రకారం ఈ కమిటీల ఎన్నిక నిర్వహించనున్నారు. 2న ఢిల్లీలో తెలంగాణభవన్‌కు శ్రీ కారం చుడుతున్న సందర్భంగానే జిల్లావ్యాప్తంగా వాడవాడలా పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ జెండా పండగ చేపట్టనున్నారు. ఇందులో పార్టీ శ్రేణులు, అభిమానులంతా భాగస్వాములు అయ్యేలా చూడనున్నారు. ఇక అదే రోజు నుంచి కమిటీల ఎన్నికకు శ్రీకారం చుట్టనున్నారు.

కొత్త కార్యవర్గాల ఎంపిక

గతంలో ఉన్న కమిటీల స్థానంలో కొత్త కార్యవర్గాలను ఎంపిక చేయనున్నారు. 2 నుంచి 12 వరకు పది రోజుల పాటు వార్డు, గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తి చేయనున్నారు. ఇవి పూర్తయ్యాక 12 నుంచి 20 వరకు మండలాధ్యక్షుడితో కూడిన కార్యవర్గాల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసుకోగానే ఆ వెంటనే జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఎన్నిక కూడా చేపడతారు. పార్టీ కమిటీలతో పాటు పార్టీకి అనుబంధం గా విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, రైతు విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు వరకు జిల్లా కమిటీలు పనిలో ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు కాలేదు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, వారు లేని చోట ఇన్‌చార్జీలు పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం పూర్తి స్థాయి జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఇన్నాళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ ఆయా కమిటీల్లో ప్రాధాన్యత దక్కనుంది. ఈ నెల 20 వరకు జిల్లా అధ్యక్షుడితో ఇతర పదవులతో కూడిన జిల్లా సంపూర్ణ కార్యవర్గం ఏర్పాటు కానుంది. ఈ ఎన్నికలన్నింటికీ ఎమ్మెల్యేలే బాధ్యులుగా వ్యవహరించనున్నారు.

అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత

కమిటీ ఏర్పాటులో సామాజికంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు పార్టీ జారీ చేసింది. ప్రతికమిటీలోనూ కనీసం 51 శాతానికి తగ్గకుండా చూడాలని లేదంటే ఆ కమిటీలను గుర్తించబోమని కూడా స్పష్టం చేసింది. మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 51శాతానికి పైగా కమిటీల్లో సభ్యులుగా ఉండాల్సిందే. కమిటీని ఏర్పాటు చేసే సమయంలోనే ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ వివరాలను కూడా స్పష్టంగా కార్యవర్గం ప్రకటన సమయంలో వెల్లడించాల్సి ఉంటుంది. ఇక ఇదే సమయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్న వారే కమిటీల్లో తీసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. సాధారణ సభ్యులకు కమిటీల్లో ప్రాధాన్యత ఉండదు. కమిటీల్లోనూ వీలైనంత వరకు యువతకు ప్రాధాన్యతనివ్వాలని కూడా పార్టీ సూచనప్రాయంగా నిర్ణయించింది.

నేటి నుంచి సన్నాహక సమావేశాలు

సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు నియోజకవర్గాల వారీగా ఆదివారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, పట్టణ, మండల, గ్రామ స్థాయి ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణంలో పాటించాల్సిన ప్రాధాన్యతలను వివరించనున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా మండలాలవారీగా ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2గంటలకు సూర్యాపేట, పెన్‌పహాడ్‌ మండలాలు, 3గంటలకు ఆత్మకూర్‌(ఎస్‌), చివ్వెంల మండలాలు, సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో మంత్రి సమావేశం కానున్నారు. వీరికి కమిటీల ఏర్పాటుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక నల్లగొండలో ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశానికి ఏర్పా ట్లు చేశారు. దీనికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సన్నాహాక సమావేశాలు జరుగనున్నాయి.

పకడ్బందీగా సంస్థాగత నిర్మాణం : తక్కెళ్లపల్లి

పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పకడ్బందీగా సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారమే కమిటీల నిర్మాణం పూర్తి చేస్తామని, అన్ని కమిటీల్లోనూ బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని, యువతకు తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. దశలవారీగా 20 వరకు జిల్లా కార్యవర్గం ఎంపిక వరకు నిర్విరామంగా సంస్థాగత సందడి కొనసాగుతుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *