గుండె నిండు గులాబీనే…

* పిడికెడు మందితో ప్రారంభమై చరిత్ర తిరగరాస్తున్న టీఆర్ఎస్

కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం 

గడపగడపకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు
* త్యాగాల పునాదులపై ఆవిర్భవించిన గులాబీ 

 

కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాం 

గుత్తా, భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర సమితి( టీఆర్ఎస్) పార్టీ పిడికెడు మందితో ప్రారంభమై చరిత్ర తిరగరాస్తున్నదని తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ కు నిబమైన బలమని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని 17వ వార్డుకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో గుత్తా, భాస్కర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నిబద్ధత ఉన్న కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు అనేక మంది ఉద్యమకారులు టీఆర్ఎస్ కు అండగా నిలిచారనే విషయాన్ని వారు గుర్తు చేశారు. చిన్న మొక్కలా ప్రారంభమైన గులాబీ పార్టీ మహా వృక్షంలా మారిందని అన్నారు. కార్యకర్తలపై ఉన్న ప్రేమతో సభ్యత్వాల నమోదులో భాగంగా బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.
రెండేండ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వాలను నమోదు చేసుకున్న టీఆర్ఎస్ రాష్ట్రంలోనే అత్యంత బలమైన పార్టీగా ఆవిర్భవించిందని అన్నారు. ప్రతీ కార్యకర్త రూ.100 చెల్లించి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందాలని కోరారు. అంతేగాకుండా, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతీ కార్యకర్త టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొందేలా చూడాలని అన్నారు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేయాలని యోచిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదవశాత్తూ మృతిచెందినట్టయితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేసి గులాబీ పార్టీ బాసటగా నిలుస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్నారని అన్నారు. అందుకే, యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలెవరికైనా ఏ ఆపద వచ్చినా ఆదుకుంటున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై అభిమానంతో రెండేండ్ల కిందట 65 వేల మంది నుంచి రికార్డు స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేశామని అన్నారు. 2001, ఏప్రిల్27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ గడిచిన 20 ఏండ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కార్యకర్తలను ఆదుకునే స్థాయికి ఎదిగిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20వసంతాలను పూర్తి చేసుకుందని అన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోందని అన్నారు. 32 జిల్లా పరిషత్ కార్యాలయాలపై గులాబీ జెండాలు రెపరెపలా డుతున్నాయని అన్నారు. 130 మున్సిపాలిటీల్లో 122 కైవసం చేసుకున్నామని, 12,751 గ్రామ పంచాయతీల్లో 9500 స్థానాల్లో గెలుపొందామని అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తున్నదన్నారు. త్యాగాల పునాధులపై ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. అంతేగాకుండా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపర్చాలని కోరారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆత్మ గౌరవం కోసం ఉద్భవించిన పార్టీ అని అన్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలను సామాజిక మాధ్యమాల్లో గట్టిగా బదులిస్తున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులను గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు అభినందించారు. గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిలో గంట శ్రవణ్ రెడ్డి, బుడిగ వెంకట ప్రసాద్, పుల్లయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, వెంకన్న, లచ్చిరెడ్డి, లింగా రెడ్డి, శ్రీనివాస్, మట్టయ్య, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజసింహా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్,పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు పత్తిపాటి నవాబ్, అయోధ్య, ఉదయ్ భాస్కర్, నాయకులు గోవింద్ రెడ్డి, శ్రీహరి నాయక్, ఎంపీటీసీ కాంతి కృష్ణ కాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *