గిరిజన సంప్రదాయానికి ప్రతీక తీజ్

 రాజీవ్ నగర్ లో అంబరాన్ని అంటిన సంబురాలు
* గిరిజనులతో యువనేత నల్లమోతు సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : గిరిజనుల కట్టుబొట్టు, నృత్యాలు, సాంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీక అని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని 12వ వార్డు- రాజీవ్ నగర్ లో గిరిజనులు నిర్వహించుకున్న తీజ్ పండుగ సంబురాలు అంబరాన్ని తాకాయి. ఈ ఉత్సవంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. తీజ్ పండుగ సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు సిద్దార్ధ శుభాకాంక్షలు తెలిపారు. ‘ జై సేవాలాల్…జై జై గోర్ బంజారా…! తీజ్ బోరావా అపన్ సంస్కృతి బచావా…! ‘అంటూ గిరిజనులమైన మనం మన సంస్కృతిని కాపాడుకుందామంటూ గిరిజనులకు మద్దతుగా వారి భాషలో సిద్దార్ధ ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు. గిరిజనుల కోసం గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఈనెల4న ప్రారంభమైన తీజ్ పండుగ సంబురాలను రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు, తండాలలో గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించు కుంటున్నారని అన్నారు. పలు ప్రాంతాల్లో కోవిడ్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిమిత సభ్యులు మాత్రమే పండుగ సంబురాల్లో పాల్గొనడంతో కొంత కోలాహలం తగ్గిందన్నారు. తమకు మంచి వరుడిని ప్రసాదించమని దేవుడిని వేడుకుంటూ పెళ్లీడుకు వచ్చిన యువతులు 9రోజుల పాటు నవధాన్యాలకు పూజలు చేయడం తీజ్ ప్రత్యేక అని సిద్దార్ధ తెలిపారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో గిరిజనులతో మమేకమై వారి నృత్యాలను తిలకించారు. తీజ్ సంబురాల్లో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో జగదాంబ మాతాకు, సేవాలాల్‌ మహరాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ధనవాత్ చిట్టిబాబు నాయక్, స్థానిక కౌన్సిలర్ మాలోతు రాణి శ్రీను, దస్రు నాయక్, రవి నాయక్, వార్డ్ అద్యక్షుడు శ్యాం కుమార్, సీతారాం నాయక్, తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *