గిడ్డి ఈశ్వరికీ అదే గతి పడుతుందని … లేఖ విడుదల చేసిన మావోలు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఎందుకు చంపాల్సి వచ్చిందీ మావోయిస్టులు వెల్లడించారు. వారి పేరుతో విడుదలైన ఓ లేఖ మంగళవారం సాయంత్ర సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వారిద్దరూ గిరిజన వ్యతిరేకులని, ప్రజా ద్రోహులని అందుకే వారిని చంపేసినట్టు అందులో పేర్కొన్నారు. అంతేకాదు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. కిడారి, సోమలకు రక్షణగా వచ్చిన ఉద్యోగులను మానవతా దృక్పథంతోనే విడిచిపెట్టినట్టు చెప్పుకొచ్చారు.

గూడ క్వారీని వదిలేయమని కిడారిని చాలా హెచ్చరించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని, బాక్సైట్ తవ్వకాలకు లోపాయికారీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయినందుకే ఆయనను ప్రజా కోర్టులో శిక్షించినట్టు చెప్పారు. అధికార పార్టీకి తొత్తుగా మారారంటూ గిడ్డి ఈశ్వరిని మావోలు హెచ్చరించారు. రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రజా కోర్టులో ఈశ్వరి గురించి కూడా కిడారి చెప్పారని, నీతులు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు. తనకు అందిన అవినీతి సొమ్మును రెండు నెలల్లో గిరిజనులకు పంచకుంటే కిడారికి పట్టిన గతే ఈశ్వరికి కూడా పడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

మావోయిస్టుల లేఖగా చెబుతున్న దీనిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల భాష భిన్నంగా ఉంటుందని, వారు వాడే కాగితాలు కూడా వేరేగా ఉంటాయని అంటున్నారు. ఈ లేఖ విషయమై పోలీసులు ఉన్నతాధికారులు మాట్లాడుతూ అది మావోయిస్టులు రాసిన లేఖ కాదని తేల్చి చెప్పారు. అది ఎవరు రాశారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు.
Tags: giddi eswari,maoists,araku mla,siveri somulu,letter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *