- ఐటీ అధికారుల పేరుతో దోపిడి
- తలలు పట్టుకున్న అధికారులు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సంచలన విషయం బయటకు వచ్చింది. ఐటీ అధికారుల పేరుతో ఉదయసింహా బంధువు రణ్ ధీర్ రెడ్డి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు నిర్వహించినట్లు ఈ రోజు తేలింది. ఐటీ అధికారుల పేరుతో కొందరు దుండగులు ఆదివారం ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఐఆర్ఎస్ భవన్ లో ఉదయసింహా విచారణకు హాజరైన సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది.
రేవంత్ అన్న కొండల్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఇళ్లపై ఆదివారం ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఉదయసింహా బంధువు రణ్ ధీర్ రెడ్డి ఇంటిలో అధికారులమంటూ వచ్చిన కొందరు తనిఖీలు చేపట్టి, పలు కీలకపత్రాలు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకుని కొన్ని కాగితాలను ఇచ్చారు. వీరికి సంబంధించిన ఐదు ఫోన్లను కూడా తీసుకుపోయారు. అలాగే రణ్ ధీర్ ను తమ వెంట తీసుకెళ్లి రాత్రంతా ఓ చోట కూర్చోబెట్టి మర్నాడు వదిలేశారు.
ఈ విషయాన్ని ఆయన ఉదయసింహాకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు తాను విచారణకు హాజరైన సందర్భంగా ఈ విషయాన్ని అధికారుల వద్ద ఆయన ప్రస్తావించారు. తన బంధువు ఇంటిపై 15 మంది అధికారులు దాడిచేశారని ఉదయసింహా చెప్పడంతో ఐటీ అధికారులు విస్తుపోయారు.
తాము ఎలాంటి దాడి చేయలేదని వారు స్పష్టం చేయడంతో బిత్తరపోవడం మిగతావారి వంతయింది. ఐటీ అధికారులు కాకుంటే ఈ దాడులు నిర్వహించింది ఎవరని అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ దాడికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? లేక పోలీసులు వహిస్తారా? అని ఉదయసింహా ప్రశ్నించారు.
Tags: tpcc,working president,kondal reddy, it rides,udhai simha reddy