ఆంక్షలు లేకుండా దళిత బంధు

రైతు బంధు తరహాలోనే వర్తింప చేయాలి
ఆరంభ శూరత్వం కావొద్దు
మహాజన నేత మంద కృష్ణ మాదిగ
సిద్దిపేట, అక్షిత ప్రతినిధి : ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు తరహాలో దళితులoదరికి వర్తింప చేయాలని మహా జన నేత మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆరంభ శూరత్వంగా కాకుండా రాష్ట్ర మంతా పథకాన్ని వర్తింప చేసి దళిత సాధికారతకు కృషి చేయాలని కోరారు. బుధవారం ఎస్సీ సమగ్ర అభివృద్ధి కమిటీ ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దళితుల ఓట్లను గంప గుత్తాగా వేయించుకునేందుకు సీఎం కేసీఆర్ మరో కుట్రకు తెరలేపారన్నారు. దళితుడికి సీఎం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర పథకాల అమలు కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. కేసిఆర్ దళితులను మోసం చేయడానికి మరోమారు దళిత బంధు పథకం పేరు మీద హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా దళితుల ఓట్లను టీఆర్ఎస్ వైపు మళ్ళించడానికి మరోసారి మోసపూరితమైన ప్రకటన చేసి దళితులను మోసం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళిత సమాజం అంతా ఏకమై కేసిఆర్ ని ఎదుర్కోవడానికి రానున్న రోజుల్లో రాజకీయంగా..ఉద్యమపరంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసిఆర్ కు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లయితే దళితబంధు పథకాన్ని తక్షణమే హుజరాబాద్ లో ఏ విధమైన పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ రావు మాట్లాడుతూ ఇప్పటివరకు సీఎం కేసీఆర్ పలికిన పలుకులు విని దళితులు ఓట్లు వేశారని, ఇక కాకమ్మ కబుర్లకు కాలం చెల్లిందన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే పథకాన్ని అందరికి రాష్ట్ర మంతా వర్తింప చేయాలన్నారు. రైతు బంధు పథకం వందల ఎకరాలు ఉన్నోళ్లకు కూడా వర్తింప చేసి దళిత బంధుకు ఆంక్షలేoటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోమసా శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *