ఖాతాలో పది లక్షలు… దళితుల్లో సంబురాలు

★ ఖాతాలో పది లక్షలు పడ్డయ్‌

★ లబ్ధిదారుల అకౌంట్లలో దళితబంధు నిధులు

★ ఒక్కో ఖాతాలో 9.90 లక్షలు.. రక్షణనిధికి 10వేలు

★ హుజూరాబాద్‌ దళిత కుటుంబాల్లో సంబురాలు

హుజురాబాద్, అక్షిత ప్రతినిధి : హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితుల ఫోన్లకు శుక్రవారం సాయంత్రం నుంచి వరుసగా టింగ్‌.. టింగ్‌ అంటూ సందేశాలు వస్తున్నాయి. తెరిచి చూసిన వారు.. తమ ఖాతాల్లో రూ.9.90 లక్షలు జమ అయినట్టు ఆ సందేశాల్లో ఉండటంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. తోటివారికి వాటిని చూపుతూ సంబురాలు చేసుకుంటున్నారు. దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శుక్రవారం లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ అయింది. ఒక్కొక్కరి ఎస్‌బీఐ ఖాతాలో రూ.9.90 లక్షలు జమ అయినట్టు శుక్రవారం ఫోన్‌కు సందేశాలు వచ్చాయి. మరో రూ.10 వేలు దళితుల రక్షణ నిధికింద జమచేశారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించేందుకు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనావేశారు. ఇందుకోసం గతనెల 9న కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాలో రూ.500 కోట్లు వేయగా.. 26వ తేదీవరకు మరో రూ.1,500 కోట్లు జమచేసి సీఎం కేసీఆర్‌ మాట నిలబెట్టుకొన్నారు. 26వ తేదీనే ముందుగా ఎంపికైన 15 మంది లబ్ధిదారులకు కోరుకున్న యూనిట్లు పంపిణీ చేశారు. 27 నుంచి సుమారు 450 మంది అధికారులు, సిబ్బంది నియోజకవర్గంలోని దళితవాడల్లో తిరిగి కుటుంబాల స్థితిగతులను తెలుసుకున్నారు. కరీంనగర్‌, హనుమకొండ కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, రాజీవ్‌ హన్మంతు పర్యవేక్షణలో దాదాపు సర్వే పూర్తిచేశారు. కలెక్టర్ల ఆదేశాల మేరకు లబ్ధిదారులు వారికి కేటాయించిన మండలాలు, పట్టణాల్లోని బ్యాం కుల్లో తెలంగాణ దళితబంధు పేరుతో ఖాతాలు తెరిచారు. గతంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాల్లో 66 వేలకుపైగా జనాభా ఉండగా, సర్వేలో 24 వేలకుపైగా కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తున్నది. కొత్తగా నమోదైన కుటుంబాలకు కూడా దళితబంధు వర్తిస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని దాదాపు 24 వేల దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. సర్వే ఇలా పూర్తయ్యిందో లేదో లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు వచ్చి చేరుతున్నది.

అంబరాన్నంటిన సంబురాలు
———————————–
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతున్నట్టు సందేశాలు వస్తుండటంతో దళితులు కుటుంబాల్లో సంబురాలు మిన్నంటాయి. శుక్రవారం సాయంత్రం నుంచి వస్తున్న సందేశాలతో నియోజకవర్గంలోని దళితవాడల్లో హడావిడి మొదలైంది. దళితులు రోడ్లపైకి వచ్చి సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకుంటున్నారు. తమ జీవితాల్లో ఇదే అసలైన పండుగ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ అంబేదర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పటాకులు కాల్చి, దళితులకు, పార్టీ కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి గ్రామంలో సర్పంచ్‌ కాతుమండి మహేందర్‌, దళితుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. జరిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ హాజరయ్యారు.

వాసాలమర్రి సర్వే పూర్తి!
—————————–
ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితబంధు పథకం అమలుపై అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే దాదాపు పూర్తయింది. గ్రామంలోఉన్న 76 దళితకుటుంబాల సమగ్ర వివరాల సేకరణ చివరిదశకు వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లో పూర్తి నివేదిక తయారవుతుందని అధికారులు తెలిపారు. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు ప్రభుత్వం గతనెల 5న రూ.7.60 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

ప్రతిపక్షాల ఆరోపణలు పటాపంచలు
—————————————
దళితబంధు ఎన్నికల పథకమేనని.. అందరికీ సాయమందించడం అసాధ్యమంటూ దళితబంధును ప్రకటించిన నాటినుంచి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టాయి. మొక్కుబడిగా కొందరికే సాయం అందజేస్తారంటూ దళితుల కుటుంబాల్లో చిచ్చుపెట్టేందుకు యత్నించాయి. అట్టడుగున ఉన్న దళితవర్గాన్ని అందలంపైకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ తెచ్చిన పథకాన్ని స్వాగతించకుండా అడ్డమైన ఆరోపణలు చేస్తూ వచ్చాయి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీటన్నింటినీ పటాపంచలు చేశారు. ఇది ఎన్నికల పథకం కాదని.. దళితులు ఎదిగేలా చేసే పథకమని నిరూపించారు. పార్టీలు, ఎన్నికలతో సంబంధం లేకుండా దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. గత నెల 26 వరకే రూ.2 వేల కోట్లు ఖాతాలో వేయడమే కాదు.. వాటిని ఇప్పుడు ఏకంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ప్రతిపక్షనేతల నోళ్లు మూయించారు. బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అనే తేడాలేకుండా అర్హులైన దళిత లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దళితుల ఆర్థికస్థితిగతులను మెరుగుపర్చడంలో సీఎం కేసీఆర్‌ ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో దీనినిబట్టి స్పష్టమవుతున్నది.

పైసలు పడ్డయ్‌..
————————-
దళితబంధు కింద సీఎం కేసీఆర్‌ సారు ఇస్తనన్న రూ.9.90 లక్షలు నా ఖాతాల పడ్డయ్‌. బతికున్నంత కాలం సారుకు రుణపడి ఉంట. దళితుల బతుకుల్లో కేసీఆర్‌ సారు కొత్త వెలుగులు నింపుతున్నడు. ఆయన మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దేవుడు.
-ఈసంపల్లి రవీందర్‌, కమలాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *