12,521 మంది ఖాతాల్లోకి దళితబంధు

 మిగతా వారికి త్వరలోనే జమచేస్తాం

★ దళితబంధు ఉన్నత స్థాయి సమీక్షలో
మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, గంగుల

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : దళిత బంధు పథకం కింద హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎంవో కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రులు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మా ట్లాడుతూ.. దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్‌లో సర్వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు కలెక్టర్‌ సహా అధికారులను అభినందించారు. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమైన లబ్ధిదారులు మంచి యూనిట్లు ఎంపిక చేసుకునేలా అధికారులు సహకరించాలని కోరారు. మిగతా వారికి త్వరలోనే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

12లోగా మరోసారి విచారణ..
————————————-
విచారణ సందర్భంగా తప్పిపోయిన, వలస వెళ్లిన దళిత కుటుంబాలను ఈ నెల 12లోగా గుర్తించి, మరోసారి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ మంది లబ్ధిదారులు ట్రాక్టర్లు, కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, అందరు ఒకేలా తీసుకుంటే ప్రయోజనం ఉండదని, ఇలాంటి వారి ఇండ్లకు వెళ్లి మరోసారి కౌన్సెలింగ్‌ చేసి ప్రత్యామ్నాయ యూనిట్లను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో మెడికల్‌, ఫెర్టిలైజర్‌, వైన్‌, సివిల్‌ సప్లయీస్‌, రెసిడెన్సియల్‌ హాస్టళ్లు, దవాఖానల్లో అవసరమైన సరుకులు పంపిణీ చేసేందుకు దళితబంధు లబ్ధిదారులకు రిజర్వేషన్లు కల్పించే విధంగా త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రులు వెల్లడించారు. యూనిట్‌ విలువను ఆధారం చేసుకుని ఒకే లబ్ధిదారులు రెండు, మూడు విధాలుగా లబ్ధి పొందే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. 18 ఏండ్లు నిండని తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవతా దృక్పథంతో యూనిట్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గత నెల 16న సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా యూనిట్లు మంజూరు చేసిన 15 మందిలో అందరికీ యూనిట్లు గ్రౌండింగ్‌ చేసినట్టు మంత్రులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *