దళిత బంధు కాదది.. ఎన్నికల బంధు

హుజూరాబాద్‌లోనే ఆరంభం…అక్కడే అంతం

– ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే హుజూరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి

– మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం, ఉద్యోగ నియామకాల్లో 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

– టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనలో
దళిత సాధికారత పూర్తిగా వెనక్కి
కేసీఆర్ ను ఓడిస్తే… పీడిత ప్రజలకు భవిష్యత్

ఎంఎస్‌పీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఫైర్‌

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :
దళితుల అభివృద్ధి కోసమంటూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ‘ దళిత బంధు కాదది… ‘ హుజూరాబాద్‌ ఎన్నికల బంధు అని మహాజన సోషలిస్టు పార్జీ జాతీయ అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టడమే లక్ష్యంగా మనందరం కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. దళిత సీఎం హామీ ఎలాంటిదో .. దళిత బంధు కూడా అలాంటిదేనని ఆయనవిమర్శించారు. ఈ దళిత బంధు పథకం అమలు చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్లయితే.. హుజూరాబాద్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ఆ నియోజక వర్గంలోన 21 వేల కుటుంబాలకు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘ టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనలో దళిత సాధికారత ముందుకు సాగిందా..? వెనక్కి నెట్టివేయబడిందా..? ‘ అనే అంశంపై మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్‌ సురేపల్లి సుజాతా అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి మంద కృష్ణ మాదిగ, వివిధ పార్టీలు నాయకులు, దళిత మేదావులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. ‘ దళిత బంధు పథకం హుజూరాబాద్‌లోనే ప్రారంభమై.. హుజూరాబాద్‌లోనే ముగుస్తుంది. నమ్మించడం.. మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన దళిత సాధికారత.. కేసీఆర్‌ పాలనలో మాత్రం పూర్తిగా వెనక్కి నెట్టివేయబడింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మంత్రి వర్గంలో దళితుల ప్రాతినిధ్యం పెంంచాలి. కొప్పుల ఈశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. ఉద్యోగ నియామకాల్లో 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. సీఎం కార్యాలయం, సలహాదారుల్లో దళిత అధికారుల శాతం పెంచాలి ‘ అని ఆయన డిమాండ్‌ చేశారు. 80 శాతం మంది దళిత వర్గాలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం తెలిసే కొత్త నాటకానికి తెరలేపారని ఆయన దుయ్యబట్టారు. ఉద్యమం సమయంలో దళిత సీఎం అని.. రాష్ట్ర వచ్చాక ఆయనే సీఎం అయ్యారని అన్నారు. మూడు ఎకరాల ఇవ్వలేదని, సబ్‌ప్లాన్‌ నిధులు కూడా రూ. 85 వేల కోట్లకు గాను రూ. 55 వేలు ఖర్చు చేశారని ఆయన తెలిపారు. ఈ రూ. 55 వేల కోట్లలో సగం నిధులు కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని, ఇప్పటి వరకు దళితుల కోసం ఖర్చు చేసింది కేవలం రూ. 25 వేల కోట్లేనని మంద కృష్ణ మాదిగ తెలిపారు. దళిత బంధుకు సబ్‌ప్లాన్‌ నిధులే తప్పా.. కేసీఆర్‌ ప్రత్యేకంగా ఖర్చు చేసిందేమి ఉండదన్నారు. దళితుల్లో రాజకీయ చైతన్యం పెరగడం వల్లే ధర కూడా పెరుగుతోందన్నారు. దళిత బంధు కింద ఇచ్చే రూ. 10 లక్షలతో పాటు అదనంగా మూడు ఎకరాల భూమి కోసం ప్రతి కుటుంబానికి అదనంగా రూ. 30 లక్షలు ఇవ్వాలని కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి భూ కేటాయింపుల్లోనూ వివక్షతను చూపించారని ఆయన మండిపడ్డారు. ఏ పార్టీలో దళితులకు సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదు. ఏ రాజకీయ పార్టీలోనూ దళిత వర్గాలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని మంద కృష్ణ మాదిగ అన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నొళ్లొందరు బానిసలుగానే ఉన్నారని, కాంగ్రెస్‌, బీజేపీలో కూడా 30 ఏళ్ల సీనియర్లుగా ఉన్న దళితులకు ఇప్పటి వరకు ఆ పార్టీ అధ్యక్షపదవులు కూడా ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో అనుసరించే వ్యూహంతో పాటు రాజ్యాధికారం కోసం సాగే ప్రయత్నాలపై భవిష్యత్‌ కార్యాచరణ కోసం త్వరలోనే సమావేశం అవుదామని దళిత మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సీనియర్‌ దళిత నేత జేబీ రాజు, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు కె. రాములు, టీడీపీ ఎస్సీఎస్‌ అధ్యక్షులు అశోక్‌, ప్రొఫెసర్లు గాలి వినోద్‌కుమార్‌, పసునూరి రవీoదర్‌, జిలుకర శ్రీనివాసులు, సీపీఎం నాయకులు స్కైలాబ్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకులు రాగాటి సత్యం మాదిగ, తిప్పారపు లక్ష్మణ్‌మాదిగ, డాక్టర్‌ కృష్ణయ్య,  నేతలు రుద్రవరం లింగస్వామి, మానవతరాయ్‌, దుర్గం భాస్కర్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *