మన సాగు… దేశానికే తలమానికం

దేశానికే దిక్సూచి తెలంగాణ వ్యవసాయ విధానాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు అనుకూల వ్యవసాయ విధానాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ‘రైతు ఆత్మహత్యలు.. అతి తక్కువగా నమోదైన రాష్ట్రం తెలంగాణ’ అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం గణాంకాలు వెల్లడించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మస్థయిర్యం పెరిగి.. ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ నిపుణుల సూచనలతోనే ఆరునెలల పాటు మేధోమధనం చేసి, రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.

వ్యవసాయంతోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
వ్యవసాయరంగం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రతి పౌరుడు అభివృద్ధి చెందితే.. రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. 60శాతం ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయని, తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, సాగునీటి కల్పన, పంటలు మద్దతు ధరతో కొనుగోలు చేయడం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. 2018లో రైతుబంధు అమలు చేసిన తర్వాత 2019లో రైతుల ఆత్మహత్యలు 491కి తగ్గిపోయాయని, పార్లమెంట్‌లో కేంద్రం ఈ సమాధానం చెప్పడం వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ముందుచూపునకు నిదర్శనమన్నారు. పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ద్వారా బ్యాంకుల చుట్టూ, ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద అప్పులకు దూరంగా ఉంచడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. సాగునీటి కల్పన, ఉచిత కరెంటుతో పాటు సాగు, దిగుబడి పెరగడం మార్కెట్‌లో మద్దతు ధర దక్కడం లభించడం రైతులు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేసిందన్నారు.

ఆత్మవిమర్శ చేసుకోవాలి :

వ్యవసాయ రంగ అనుకూల విధానాలతో కొత్త భూమి సాగులోకి రావడం, వ్యవసాయరంగానికి దూరమైన వారు తిరిగి సాగు చేపట్టారన్నారు. గతంలో వ్యవసాయ సంక్షోభం కారణంగా ఇతర రంగాలకు మళ్లిన వారు సైతం తిరిగి వ్యవసాయంపై దృష్టి సారించారన్నారు. పెరిగిన పంటలు, ఉపాధితో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చెందిందన్నారు. కరోనా విపత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చెందగా.. గత ఏడాది తెలంగాణలో మాత్రం ప్రాథమిక రంగంలో 17శాతం, వ్యవసాయ రంగంలో 20శాతం అభివృద్ధి నమోదు చేయడం తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే సాధ్యమైందన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు దొరకని పరిస్థితి నుంచి రుణాల కోసం బ్యాంకుకు వెళ్లని పరిస్థితి తెలంగాణలో నెలకొంటున్నదన్నారు. రైతుబంధుపై రాజకీయం చేసేవారు కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయరంగంలా భవిష్యత్‌లో దళితబంధు పథకం ద్వారా ఎస్సీలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని, పథకం విజయవంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *