నేతన్నలకు చేయూత అందించాలి

ఒక్కో చేనేత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్ధిక సాయం అందజేయాలి : మారం శ్రీనివాస్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతన్నలకు చేయూతను అందించాలని బీసీ జేఏసీ నేత మారం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వేలాది నిరుపేద చేనేత కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. చేనేత కార్మికుల సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఆకాంక్షించారు. అర్హులైన నిరుపేద చేనేత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అభ్యర్ధించారు. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చేనేత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది ఆగస్టు15న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో మానుపురం గ్రామానికి చెందిన 30 చేనేత కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఓ వృద్ధురాలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చింది. వారందరికీ ప్రభుత్వ సాయం అందించాలని అభ్యర్ధించింది. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చేనేత కార్మికుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ కోవిడ్ విసిరిన పంజా కారణంగా అతలాకుతలమైన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మారం శ్రీనివాస్ అభ్యర్ధించారు. సిరిసిల్ల జిల్లాలోని చేనేత కార్మికులకు అందించే చేయూత, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నేతన్నలందరికీ వర్తింపచేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్షించారు. చేనేత కార్మికులు నేత వేసిన వస్త్రాలను ప్రతీ ఒక్కరూ కొనుగోలు చేయాలని మారం శ్రీనివాస్ అభ్యర్ధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *