సీడిఎఫ్ నిధులతో…మిర్యాలగూడ ప్రగతి

అప్రతిహతంగా నియోజకవర్గాల అభివృద్ధి
* పట్టణ ప్రగతితో మారిన పుర రూపురేఖలు
* పారిశుధ్యం, పచ్చదనానికి తొలి ప్రాధ్యాన్యం
* ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సీడీఎఫ్ నిధులను     రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచిన సర్కార్

మిర్యాలగూడ ఎంఎల్ ఏ నలమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ ప్రభుత్వం అప్రతిహతంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి సరిపడ నిధులను మంజూరు చేస్తున్నదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు నిధిగా కోటి రూపాయలను గత ప్రభుత్వాలు ఖర్చు చేసేవని, వీటి ఖర్చు విషయంలో సవాలక్ష ఆంక్షలు, నిబంధనలుండేవని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల అభివృద్ధి కోసం రూ.3కోట్లు నిధులు మంజూరయ్యేవని అన్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ సీడీఎఫ్ నిధులను రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచుతూ రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు జీవోనెంబర్ 13 ను శుక్రవారం జారీ చేశారని భాస్కర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 17వ వార్డు-హౌసింగ్ బోర్డు, 18వ వార్డు-సుందర్ నగర్ కాలనీల్లో భాస్కర్ రావు శనివారం పర్యటించారు. సబ్ జైల్ రోడ్ లో పారిశుధ్య నిర్వహణను ఆయన పరిశీలించారు. అనంతరం నూతన కల్వర్ట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. వార్డు ప్రజలకు పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కవోని సంకల్పంతో హరితహారం కార్యక్రమం చేపడుతోందని అన్నారు. వార్డుల్లోని ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కరోనా కష్టకంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు.
సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో నాలాల పరిశుభ్రత, పొదలు,పిచ్చి మొక్కల తొలగింపు, విద్యుత్ దీపాల పర్యవేక్షణ, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయుట,పార్కు పరిశుభ్రత, అక్రమ నిర్మాణాల తొలగింపు తదితర పనులను మున్సిపల్ అధికారులు నిరంతర ప్రక్రియగా భావించి నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు,వార్డు ఇంఛార్జీలు తమ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. వానాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా పట్టణ ప్రగతిలో భాగంగా అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేందుకు సీడీఎఫ్ నిధులు ఉపకరిస్తాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని భాస్కర్ రావు అన్నారు. రెండేండ్లలో రూ.766కోట్ల 12లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త,చెదారం సేకరణ కోసం కోటి 67 లక్షల రూపాయలతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీలు కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. పట్టణంలో పే అండ్ యూజ్ విధానం ద్వారా రూ.72 లక్షల వ్యయంతో ఆరు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని అన్నారు. త్వరలో సమీకృత మార్కెట్ ను ప్రారంభించనున్నామని అన్నారు. అంతేగాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయించానని అన్నారు. అహ్లాదాన్ని పంచే మినీ ట్యాన్క్ బండ్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సరిపడకపోతే అదనంగా రూ.6కోట్లు కేటాయించినట్టు తెలిపారు. స్థానిక సుందరయ్య పార్కులో సుందరీకరణ పనులు చేపట్టామని చెప్పారు. ఈనెల10 వరకు కొనసాగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని భాస్కర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు,మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, మున్సిపల్ డీఈఈ సాయిలక్ష్మీ, దుర్గారావు, కొండలు, కోలా వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *