కరోనా నిబంధనలు బేఖాతర్

రిజిస్ట్రేషన్లకు కిక్కిరిసిన జనం

భూముల క్రయ విక్రయాల జోరు

సూర్యాపేట, అక్షిత బ్యూరో :

జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అమ్మకం, కొనుగోలుదారులు ఒక్కసారిగా కిక్కిరిసి పోయారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలు చేస్తున్నా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవేవి పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు చూసి ఇదేమి చోద్యమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ మరియు ధరణి యాప్ కారణంగా గత కొంత కాలంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిన  సంగతి తెలిసిందే. దీనితో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు సొంత క్రయ, విక్రయాలు కూడా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టగానే ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారితో పాటు,వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయ విక్రయాల కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తరలిరావడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయం చిన్నపాటి జాతరను తలపిస్తుంది.ఇదే అదునుగా భావించి కొంతమంది బ్రోకర్లు కార్యాలయంలోని వివిధ స్థాయిల్లో పని చేస్తున్న అధికారుల అండదండలతో ప్రజల వద్ద లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలోని
శ్రీరామ్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్ లో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన వారు తమ వాహనాలను రోడ్ పై పార్కింగ్ చేయడంతో ఆ రోడ్ లో ప్రజలతో పాటు శ్రీరామ్ నగర్ కాలనీ ప్రజలు నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శ్రీరామ్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు పేరుకుపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయాలని కోరుతున్నారు.అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను ఇక్కడి నుండి దూర ప్రాంతానికి తరలించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *