బీఎస్పీ గూటికి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

ముహూర్తం ఫిక్స్.. బీఎస్పీలోకి ఆర్ ఎస్పీ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బహుజనుల గొంతుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ గూటికి చేరనున్నారు. ఈ విషయమై ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేసింది. ఆగస్టు 8న ప్రవీన్ కుమార్ బీఎస్పీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు స్పష్టమైంది. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే మూడు సిద్ధాంతాలతో బహుజన సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చేందుకే.. ప్రవీణ్ కుమార్ తన అత్యున్నత పదవికి రాజీనామాచేసిన విషయం విదితమే. నల్గొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో ఆగస్టు 8న భారీ బహిరంగ సభ ఉంటుందని స్వారోస్ ప్రతినిధి స్వామి తెలిపారు.దాదాపు 5 లక్షల మంది సాక్షిగా బీఎస్పీలో చేరతారని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ రాంజీ గౌతం ప్రవీణ్ కుమార్ కు పార్టీ కండువా కప్పి స్వాగతించనున్నారు. తెలంగాణ నలుమూలల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాల ప్రజలు… లక్షలాదిగా నల్గొండ ఎన్జీ కాలేజ్ మైదానానికి తరలి రావాలని స్వాములు కోరారు. మన బతుకులు మార్చడం కోసం.. ప్రవీణ్ కుమార్ గొప్ప త్యాగం చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకొని రావాలని కోరారు.నిజానికి కాన్షీరాం అడుగుజాడల్లో నడుస్తానని ప్రవీణ్ కుమార్ ప్రకటించినప్పుడే.. బీఎస్పీ గూటికి చేరతారని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా సంప్రదించారని వార్తలొచ్చాయి. అంతేకాదు సొంతంగా పార్టీ పెడతారని కూడా అనుకున్నారు. కానీ.. చివరకు బీఎస్పీలో చేరుతున్నట్లు స్పష్టత వచ్చింది.ఇప్పటికే టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన టీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఆధిపత్య కులాల నాయకులను గారు అని సంబోధించి…గౌరవించి.. పీడిత వర్గాలకు చెందిన వారిని ఏక వచనంతో పిలిచారని మండిపడ్డారు. ఈ దురహంకార భావజాలం వల్లే ప్రజలు బహుజన రాజ్యం రావాలని అంటున్నారని చెప్పారు. ఈ లెక్కన బీఎస్పీ కండువా కప్పుకోగానే వరుసబెట్టి పార్టీలన్నింటినీ కడిగిపారేయనున్నారు ఆర్ ఎస్ ప్రవీణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *