నవసమాజ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర 

 నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : నవసమాజ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర కీలకపాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు, బలహీన వర్గాల యువతను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీలో అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం కల్పించి గౌరవిస్తోందన్నారు. ప్రతీ కార్యకర్తను, కార్యకర్త కుటుంబాలను టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే దిశగా వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి వంటి రంగాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని అన్నారు. ఉపాధికి అవకాశమున్న టూరిజం, లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నదన్నారు. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తున్నదన్నారు. శాస్త్రీయ పద్ధతిలో జోనల్ విధానాన్ని అమలులోకి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు మార్గం విస్తృతం చేసుకున్నామన్నారు. వినూత్న పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా యువత ఉపాధికి బాటలు మెరుగవుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతున్నదన్నారు. యువత నిబద్ధత, అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేసి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *