ఆడబిడ్డలకు సర్కారు సారె

నల్గొండ, అక్షిత ప్రతినిధి : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు 9.44 లక్షలపై  చిలుకు చీరెలు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల్లో జిల్లాకు.. వరుసగా ఐదో ఏడాదీ పంపిణీ చేపట్టనున్నారు. భద్రపరిచేందుకు గోదాములు సిద్ధం చేశారు. ఈసారి అదనంగా మరో 33 వేల మందికి సర్కారు సారె అందించనున్నారు. పంపిణీకి మండల, గ్రామస్థాయిలో కమిటీలు…తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకమైంది. దసరా పండుగ వేళ చిన్నాపెద్దా వాడవాడలా జరుపుకొనే వేడుక ఇది. మరీ ముఖ్యంగా మహిళలకు ఇదో మధుర జ్ఞాపకం. ఆడబిడ్డలకు కానుకగా ప్రభుత్వం వరుసగా ఐదో సంవత్సరం కూడా బతుకమ్మ చీరెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు 9.44 లక్షల పైచిలుకు చీరెలు కేటాయించింది. గతేడాది కంటే ఈసారి 33 వేలు అదనంగా అందించనున్నది. రెండ్రోజుల్లో బతుకమ్మ చీరెలు జిల్లాకు చేరనుండగా భద్రపరిచేందుకు అధికారులు గోదాములను సిద్ధం చేశారు. పండుగ నాటికి గ్రామస్థాయి కమిటీల ఆధ్వర్యంలో చీరెలను పంపిణీ చేయనున్నారు. చేనేత వృత్తికి పునరుజ్జీవం కల్పించడం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల్లోంచి పుట్టిన పథకమే బతుకమ్మ కానుక. 2017 సంవత్సరం నుంచి ప్రతి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నారు. వరుసగా ఐదో ఏడాది కూడా చీరెల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాల వారీగా అర్హులైన మహిళలకు ప్రతిపాదనలు గతంలోనే జిల్లా చేనేత జౌళి శాఖ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటికే చీరెలను తయారు చేయించి ఆయా జిల్లాలకు చేరవేసే పనిని ముమ్మరం చేశారు.

9,44,279 చీరెల పంపిణీకి ఏర్పాట్లు :
నల్లగొండ జిల్లాలో ఆహారభద్రత కార్డులు 4,68,179 ఉండగా వీటిలో బతుకమ్మ చీరెలకు 5,52,509 మంది, సూర్యాపేట జిల్లాలో 3,91,770 మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. రెండు జిల్లాల్లో మొత్తం 9,44,279 చీరెలను పంపిణీ చేయనున్నారు. కాగా గతేడాదితో పోలిస్తే 33 వేలకు పైగా లబ్ధిదారులు ఈ ఏడాది అదనంగా వచ్చి చేరారు. గతేడాది రెండు జిల్లాల్లో కలిపి 9,11,466 లబ్ధిదారులుగా ఉన్నారు. పెరిగిన లబ్ధిదారులతో కలిపి అర్హులైన ప్రతి ఒక్కరికీ బతుకమ్మ చీరెలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. రెండ్రోజుల్లో మొదటి దఫా చీరెలు జిల్లాకు చేరనున్నాయి. తర్వాత మిగతావి కూడా జిల్లాలకు చేరేలా ఉన్నతస్థాయిలో చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేకంగా గోదాము గుర్తింపు

చీరెలను భద్రపరిచేందుకు నల్లగొండ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆరు చోట్ల బఫర్‌ గోదాములను గుర్తించారు. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి తిప్పర్తి మార్కెట్‌, మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి మిర్యాలగూడ, దామరచర్ల వ్యవసాయ మార్కెట్‌ , దేవరకొండకు సంబంధించి కొండమల్లేపల్లి, నాగార్జునసాగర్‌కు సంబంధించి నిడమనూర్‌ మార్కెట్‌ గోదాముల్లో, నకిరేకల్‌కు రైతువేదికను ప్రత్యేకంగా గుర్తించారు. వీటితో పాటు మునుగోడుకు నల్లగొండ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన చీరలన్నింటినీ సూర్యాపేటలోని విశాలమైన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాములోనే భద్రపరచనున్నారు. అక్కడి నుంచే అన్ని మండలాలకు చీరెలను చేరవేయనున్నారు. అన్ని చోట్ల గోదాముల నుంచే చీరెలను ముందుగా మండలాలకు అక్కడి నుంచి గ్రామాల వారీగా పంపిణీ చేయనున్నారు. మళ్లీ మండలాల్లోనూ గ్రామాల వారీగా చీరలను నిల్వ చేసేందుకు స్థలాలను గుర్తిస్తున్నారు. ప్రభు త్వ ఆదేశాల ప్రకారం ప్రతీ గ్రామంలోని చౌకధరల దుకాణాల వారీగా ఈ చీరెల పంపిణీ కొనసాగనుంది.

కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ

చీరెల పంపిణీని సజావుగా నిర్వహించేందుకు మండల, గ్రామ స్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, తాసీల్దార్‌, ఎంపీఓలతో మండల కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ పర్యవేక్షణలో గ్రామస్థాయిలోనూ పంపిణీ కోసం మరో కమిటీని ఏర్పాటు చేస్తారు. పంచాయితీ కార్యదర్శి, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, రేషన్‌ షాపు డీలర్‌లు కమిటీలో ఉండనున్నారు. వీరితో పాటు పట్టణాల్లో వార్డుల వారీగా అర్బన్‌ బిల్‌కలెక్టర్‌, రేషన్‌ డీలర్‌, వార్డు ఆర్గనైజర్లతో కమిటీలను రూపొందిం స్తున్నారు. రేషన్‌ షాపుల వారీగా లబ్ధిదారుల జాబితాను ఈ కమిటీలకు అం దజేస్తే వీరు ఆ జాబితా ప్రకారం పంపిణీ చేయనున్నారు.

కరోనాలోనూ నేతన్నలకు ఉపాధి

బతుకమ్మ చీరెల పథకం ద్వారా గత పాలకుల హయాంలో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైన వస్త్ర పరిశ్రమకు పునరుజ్జీవం కల్పించడం కూడా ప్రభుత్వం లక్ష్యాల్లో ఓ భాగం. ప్రారంభ సంవత్సరంలో సూరత్‌, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి వీటిని కొనుగోలు చేసినా తర్వాత ప్రభుత్వం అన్నింటినీ రాష్ట్రంలోనే తయారయ్యేలా చర్యలు చేపట్టింది. తద్వారా నేతన్నలకు ఉపాధి కల్పించినైట్లెంది. సిరిసిల్ల, ఇతర ప్రాంతాల్లోని నేతన్నలతో పాటు, పవర్‌లూమ్స్‌కు మళ్లీ మగ్గం కళ చేకూరింది. ఈ ఏడాది చీరెల తయారీలో దా దాపు 15,000 మందికి పైగా నేతన్నలతో పాటు ఇతర కార్మికులకు ఉపాధి దొరకడంతో పాటు 20వేల పవర్‌ లూమ్‌ యూనిట్లు నడవడానికి తోడ్పాటు అందింది. చీరెల తయారీ దాదాపు ఐదు నెలల నుంచి జరుగుతుండడంతో కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ వరుసగా రెండో ఏడాది కూడా ఉపాధికి ఢోకా లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *