ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలి

* వైద్యుల కొరత సమస్యను పరిష్కరించండి
* వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీకి వినతి పత్రం అందజేత
* మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛయిన ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అభ్యర్ధించారు. ఈ మేరకు రిజ్వీకి వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా ఏరియా ఆస్పత్రిని వేధిస్తున్న వైద్యుల కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కాగా, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. దీనిలో భాగంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మూడు రోజుల పాటు హెలికాప్టర్ లో పర్యటించాలని రిజ్వీ నేతృత్వంలోని బృందాన్ని ఈనెల9న కేసీఆర్ ఆదేశించారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట్, ఖమ్మం, డోర్నకల్, హుజురాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్, బెల్లంపల్లి, గోదావరి ఖని ప్రాంతాల్లో వైద్య,ఆరోగ్య శాఖ బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఏఎం రిజ్వీ మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం సందర్శించారు. మిర్యాలగూడలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల వివరాలను, కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలను, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, కరోనా విస్తరణకు ప్రధాన కారణాలు క్రిటికల్ అనాలిసిస్ కు సంబంధించిన సమాచారాన్ని స్థానిక వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తన మూడు రోజుల పర్యటన ముగిసిన అనంతరం సమగ్ర నివేదికను రూపొందించి సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం క్యాబినెట్ కు అందజేయనున్నట్టు తెలిపారు. శాస్త్రీయ పద్దతుల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని పీహెచ్సీ కేంద్రాల్లో కలిపి 1500 మందికి కోవిడ్ టీకాలు వేయించినట్టు భాస్కర్ రావు తెలిపారు. రానున్న రోజుల్లో కోవిడ్ కేసుల ఉధృతి పెరిగినట్టయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సహకరించాలని రిజ్వీని కోరినట్టు భాస్కర్ రావు తెలిపారు. టీకాలు వేయించే ప్రక్రియను చేపట్టేందుకు వ్యాక్సిన్ వాయిల్స్ సంఖ్యను పెంచాలని అభ్యర్ధించారు. ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కమిషనర్ చీమ వెంకన్న, ఎంపీడీవో దేవిక, డిప్యూటీ డీఎంహెచ్ఓ కేస రవి, డీఎస్పీ వెంకటేశ్వర రావు, స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *